Bollywood: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరోసారి భారతీయ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. పదేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరాఠీ చిత్రం ‘వెంటిలేటర్’కు సీక్వెల్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘వెంటిలేటర్ 2’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పుడు బాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌పై ప్రియాంకకు ఇంత ప్రత్యేకమైన ఆసక్తి ఎందుకు? దీని వెనుక కేవలం నిర్మాతగా ఉన్న అనుబంధమే కాకుండా, తన తండ్రితో ముడిపడిన ఒక ఎమోషనల్ కారణం కూడా ఉంది.
తండ్రి అనుభవమే సినిమాపై ఆసక్తికి కారణం!
2016లో విడుదలైన ‘వెంటిలేటర్’ సినిమాకు ప్రియాంక చోప్రా నిర్మాతగా వ్యవహరించారు. రాజేష్ మాపుస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓ కుటుంబంలోని భావోద్వేగాలు, బంధాలు, అపార్థాలు, ఆసుపత్రి నేపథ్యంలో సాగే కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కథ విన్నప్పుడు ప్రియాంకకు తన తండ్రి అశోక్ చోప్రా గుర్తుకొచ్చారట. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. తన తండ్రి కూడా వెంటిలేటర్‌పై ఉన్న సమయంలో ఎదురైన అనుభవాలు ఈ కథతో దగ్గరగా అనిపించాయి. అందుకే, ఈ సినిమాను తన తండ్రి కోసం నిర్మించాలని అనుకున్నట్లు ఆమె వెల్లడించారు. 2013లో తన తండ్రిని కోల్పోయిన ప్రియాంకకు ఈ సినిమా వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకమైనది. అందుకే పదేళ్ల తర్వాత కూడా ఈ కథను కొనసాగించాలనే ఆసక్తి చూపిస్తున్నట్లు అర్థమవుతోంది.
మూడు జాతీయ అవార్డులు అందుకున్న సినిమా!
‘వెంటిలేటర్’ కేవలం మంచి కథా చిత్రంగా మాత్రమే కాకుండా అవార్డుల పరంగానూ గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు లభించాయి. ఉత్తమ దర్శకుడిగా రాజేష్ మాపుస్కర్, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ సౌండ్ మిక్సింగ్ విభాగాల్లో ఈ చిత్రం పురస్కారాలు అందుకుంది. మరాఠీ భాషలో తెరకెక్కిన ఈ సినిమా ప్రాంతీయ కథలకు కూడా మంచి గుర్తింపు తీసుకురావచ్చని నిరూపించింది. ఈ ప్రాజెక్ట్ ప్రియాంక చోప్రా నిర్మాణ సంస్థ పర్పుల్ పెబుల్ పిక్చర్స్‌కు కూడా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.
పదేళ్ల తర్వాత మళ్లీ అదే కాంబినేషన్!
పర్పుల్ పెబుల్ పిక్చర్స్ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రియాంక చోప్రా ‘వెంటిలేటర్ 2’ను ప్రకటించారు. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన రాజేష్ మాపుస్కర్ ఈ సీక్వెల్‌కు కూడా రచయితగా, దర్శకుడిగా వ్యవహరించనుండటం విశేషం. ప్రియాంక చోప్రా, డాక్టర్ మధు చోప్రా, రాజేష్ మాపుస్కర్ కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారు. 2027లో విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే కథ, నటీనటులు, షూటింగ్ వివరాలను ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఒకవైపు, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న వారణాసి సినిమలో నటిస్తున్నారు. ఇప్పుడు, నిర్మాతగా మళ్ళీ ట్రాక్ పైకొచ్చారు ప్రియాంక.


