TG: హైదరాబాద్ ఐటీ కారిడార్‌ను కేంద్రంగా చేసుకుని ఏకంగా తొమ్మిదేళ్లుగా మత్తు సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న గంజాయి లేడీ డాన్ ఎట్టకేలకు ఖాకీల వలలో చిక్కింది. నానక్‌రామ్‌గూడకు చెందిన 51 ఏళ్ల కలాపతి నీతూ బాయిని తెలంగాణ ఈగల్ ఫోర్స్ అత్యంత చాకచక్యంగా పట్టుకుంది. 30 కేసులు, అందులో 13 కేసుల్లో నాన్-బెయిలబుల్ వారెంట్లతో వాంటెడ్‌గా ఉంటూ.. పోలీసుల కళ్లుగప్పి ఏకంగా రెండేళ్లుగా అజ్ఞాతంలో గడిపిన ఈ కిలాడీ మహిళ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, కాలేజీ కుర్రాళ్లే టార్గెట్‌గా వేల కోట్ల విలువైన గంజాయి దందాను నడిపించిన ఈ మత్తు రాణి.. ఇన్నాళ్లూ పోలీసుల రాడార్ నుంచి ఎలా తప్పించుకుంది? ఆమె లగ్జరీ సామ్రాజ్యం ఎలా కూలిపోయిందనే అంశాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.
తప్పించుకోవడంలో పక్కా స్కెచ్.. ఫోన్లు వాడదు, ఇళ్లు మారుస్తుంది
నీతూ బాయి పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు పాటించిన పద్ధతులు చూసి దర్యాప్తు అధికారులే నివ్వెరపోయారు. ఏ ఒక్క ప్రాంతంలోనూ ఎక్కువ రోజులు స్థిరంగా ఉండకుండా నానక్‌రామ్‌గూడ, గచ్చిబౌలి, లంగర్‌హౌస్ పరిసరాల్లో నిరంతరం ఇళ్లు మారుస్తూ ఉండేది. పోలీసులు ఫోన్ సిగ్నల్స్ ద్వారా ట్రాక్ చేస్తారని గ్రహించి మొబైల్ వాడకాన్ని పూర్తిగా తగ్గించేసింది. అత్యవసరమైతే తప్ప ఫోన్ ముట్టుకోకుండా కేవలం మనుషుల ద్వారే సమాచారం చేరవేసేది.
2026 జూన్‌లో సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు నానక్‌రామ్‌గూడలోని ఆమె ఇంటిపై ఆకస్మిక దాడి చేయగా.. కొద్ది నిమిషాల ముందే ఆమె అక్కడి నుంచి జారుకుంది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న రూ.2.60 లక్షల నగదును సీజ్ చేసిన పోలీసులు, ఆమె వద్ద గంజాయి కొనేందుకు వచ్చిన సుమారు 50 మంది కస్టమర్లపై కేసులు పెట్టారు. అప్పటి నుంచి ఈగల్ ఫోర్స్ టెక్నికల్ టీమ్ ఆమెపై అడుగడుగునా నిఘా పెట్టింది. గ్రౌండ్ నెట్‌వర్క్, టెక్నికల్ డేటాను విశ్లేషించి చివరకు మంగళవారం మంగళ్‌హాట్ వైపు ఆటోలో గుట్టుచప్పుడు కాకుండా వెళ్తుండగా చుట్టుముట్టి సంకెళ్లు వేసింది. ఆమె వద్ద నుంచి రూ.1.59 లక్షల నగదు, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఐటీ ఉద్యోగులే కస్టమర్లు.. రూ.కోట్లలో బల్క్ వ్యాపారం
నానక్‌రామ్‌గూడ, గచ్చిబౌలిలోని హాస్టళ్లు, అద్దె ఇళ్లలో ఉండే ఐటీ ఉద్యోగులు, విద్యార్థులే ఆమెకు ప్రధాన కస్టమర్లు. భారీ ఎత్తున బల్క్‌గా సరుకు తెప్పించి, చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి గుట్టుచప్పుడు కాకుండా విక్రయించేది. గతంలో ఎన్నిసార్లు జైలుకు వెళ్లినా.. బెయిల్‌పై బయటకు రావడం, మళ్లీ దందాను మరింత దూకుడుగా మొదలుపెట్టడం ఆమెకు అలవాటుగా మారింది. ఈ దందాలో ఆమె కుటుంబం మొత్తం భాగస్వామ్యమైంది. గతంలో ఆమె కొడుకు స్కార్పియో కారులో 22 కిలోల గంజాయి తరలిస్తూ పట్టుబడగా, వారి ఆస్తుల తనిఖీల్లో రూ.40 లక్షల నగదు దొరికింది. ఆ తర్వాత గచ్చిబౌలిలో 7.5 కిలోల గంజాయి, రూ.5 లక్షల నగదు, మరో కేసులో 22 కిలోల సరుకుతో పాటు రూ.22 లక్షల నగదును పోలీసులు సీజ్ చేసి కుటుంబ సభ్యులను కటకటాల్లోకి నెట్టారు.
గంజాయి సొమ్ముతో బహుళ అంతస్తుల భవనాలు
మత్తు దందా ద్వారా కూడబెట్టిన సొమ్ముతో నీతూ బాయి కుటుంబం భారీగా స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. లంగర్‌హౌస్‌లో రెండు G+3 అంతస్తుల భారీ భవనాలు, గచ్చిబౌలిలో ఒక G+2 బిల్డింగ్, నానక్‌రామ్‌గూడ నివాసంలో విలాసవంతమైన నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు.
ఈ ఆస్తులన్నీ గంజాయి సొమ్ముతోనే నిర్మించారన్న బలమైన ఆధారాలతో అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే నీతూ బాయి కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలతో పాటు, వారు నడుపుతున్న 'జయలక్ష్మి కిరాణా అండ్ జనరల్ స్టోర్' ఖాతాలను కూడా ఫ్రీజ్ చేశారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఈ గంజాయి లేడీ డాన్‌ను కస్టడీలోకి తీసుకుని ఈ దందా వెనుక ఉన్న అంతర్రాష్ట్ర సరఫరాదారులు ఎవరు? ఇంకా ఎవరెవరికి ఇందులో సంబంధాలున్నాయి? అనే కోణంలో ఈగల్ ఫోర్స్ లోతైన దర్యాప్తు జరుపుతోంది.


