జాతీయం

RSS: సంఘ్ నయా రూట్.. ఆపరేషన్ 'జెన్-జీ' వెనుక అసలు ప్లాన్ ఇదే!

6 నిమిషాల పఠనం

RSS: సాంప్రదాయ మైదానాలు, కాషాయ ధ్వజాలు, క్రమశిక్షణతో కూడిన శాఖలు.. శతాబ్ది ఉత్సవాల ముంగిట ఉన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) రూపురేఖలను గుర్తుచేసుకుంటే సాధారణంగా కనిపించే దృశ్యాలివి. కానీ కాలం మారింది. రాజకీయ సమీకరణాల కంటే వేగంగా తరం మారింది.

RSS: సాంప్రదాయ మైదానాలు, కాషాయ ధ్వజాలు, క్రమశిక్షణతో కూడిన శాఖలు.. శతాబ్ది ఉత్సవాల ముంగిట ఉన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) రూపురేఖలను గుర్తుచేసుకుంటే సాధారణంగా కనిపించే దృశ్యాలివి. కానీ కాలం మారింది. రాజకీయ సమీకరణాల కంటే వేగంగా తరం మారింది. చేతిలోని స్మార్ట్‌ఫోన్, వేలికొనలపై తిరిగే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఎక్స్ ట్రెండ్స్ కేంద్రంగా దేశంలో సరికొత్త ఆలోచనా ధోరణి పుట్టుకొస్తోంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం పటిష్టంగానే ఉన్నప్పటికీ, నవతరం ఆలోచనలు పాత పంథాకు సరిపడటం లేదన్న వాస్తవాన్ని సంఘ్ పరివార్ గ్రహించింది. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వేదికగా మూడు రోజుల పాటు సాగిన మేధోమథనం ఒక సంచలన వ్యూహానికి వేదికైంది.

ఆరు అంశాలు.. ఒక్కటే అసలైన టార్గెట్!

ఇండోర్ సమావేశంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్‌లతో పాటు మధ్యప్రదేశ్ కీలక మంత్రులు ఏకాంతంగా భేటీ అయ్యారు. పంజాబ్ పరిస్థితులు, యూజీసీ బిల్లు, విదేశీ నిధుల ప్రవాహం, అసంతృప్త కార్యకర్తలను గాడిన పెట్టడం వంటి వ్యవహారాలు తెరపైకి వచ్చినా.. ప్రధాన చర్చ అంతా "సోషల్ మీడియా – జెన్-జీ" చుట్టూనే తిరిగింది.

ఇటీవల కాలంలో సాంప్రదాయ పార్టీల ప్రమేయం లేకుండానే, కేవలం సోషల్ మీడియా ఆధారంగా వేలాది మంది యువత రోడ్లపైకి వస్తున్న పరిస్థితులను ఆర్ఎస్ఎస్ తీవ్రంగా పరిగణించింది. ఈ నిరసనలు, ఉద్యమాల్లో సమాచార వ్యాప్తికి డిజిటల్ మాధ్యమాలే సమన్వయ శక్తిగా మారడం, ప్రభుత్వ విధానాలపై నెగెటివ్ ప్రచారాలు పెరగడంపై అంతర్గతంగా ఆందోళన వ్యక్తమైంది.

‘దేశభక్తి గల జెన్-జీ ఆర్మీ’.. మోహన్ భగవత్ సంకల్పం

ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆర్ఎస్ఎస్ తన చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసిందని చెబుతున్నారు. ప్రభుత్వానికి, దేశ సంస్కృతికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యవస్థీకృత ప్రచారాలను ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు ఒక ప్రత్యేక డిజిటల్ మానిటరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు.

జెన్-జీ యువత కోసం ప్రత్యేక విభాగాన్ని రూపొందించాలన్నది అసలు ప్లాన్. ఈ యువత తమ సొంత హక్కుల కోసం పోరాడవచ్చు, సమస్యలపై గళమెత్తవచ్చు, అంతెందుకు.. అవసరమైతే పాలక ప్రభుత్వాల విధానాలను సైతం నిర్భయంగా వ్యతిరేకించవచ్చు. కానీ, ఆ నిరసనలు అరాచకత్వానికి తావులేకుండా, దేశ సమగ్రతను దెబ్బతీయకుండా, అంతిమంగా దేశ ప్రయోజనాలే పరమావధిగా ఉండేలా వారి ఆలోచనలను తీర్చిదిద్దాలన్నది సంఘ్ ఆలోచనగా కనిపిస్తోంది.

"కొన్ని విదేశీ శక్తులు, దేశ వ్యతిరేక శక్తులు అమాయక జెన్-జీ యువతను తమ స్వార్థ రాజకీయాల కోసం ఒక ముసుగులా వాడుకుంటున్నాయి" అంటూ మోహన్ భగవత్ చేసిన హెచ్చరిక ఈ భేటీలో హైలైట్‌గా నిలిచింది. విదేశీ నిధులతో కొన్ని సంస్థలు నడిపిస్తున్న ఎజెండాలపై కేంద్ర ఏజెన్సీలు ఇప్పటికే పక్కా ఆధారాలు సేకరించాయని, వీటికి అడ్డుకట్ట వేసేలా చట్టాలు మరింత కఠినతరం కావాలని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది.

‘వ్యక్తి నిర్మాణమే’ అంతిమ లక్ష్యం

అయితే ఒక పక్కా సైద్ధాంతిక సంస్థగా ఆర్ఎస్ఎస్ తన మూలాలను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. సోషల్ మీడియా ద్వారా కౌంటర్ ఇవ్వడం, నేటి తరానికి అర్థమయ్యే భాషలో మాట్లాడటం వరకే డిజిటల్ పరిధి పరిమితమని సంఘ్ నేతలు తేల్చిచెప్పారు. కేవలం వైరల్ రీల్స్, యూట్యూబ్ డిబేట్లతో ఏ భావజాలమూ కలకాలం నిలబడదని.. ఒక వ్యక్తిని నేరుగా కలవడం, వారితో వ్యక్తిగత బంధాన్ని ఏర్పరచుకోవడమే ఆర్ఎస్ఎస్ శైలి 'వ్యక్తి నిర్మాణం' అని పునరుద్ఘాటించారు.

డిజిటల్ మాయాజాలం వైపు పరుగులు తీస్తున్న నవతరాన్ని తమ సాంప్రదాయ పద్ధతుల్లోనే మచ్చిక చేసుకుంటూ.. 'దేశభక్తి గల యువతరం'గా మలచడానికి ఆర్ఎస్ఎస్ మొదలుపెట్టిన ఈ సరికొత్త ఆపరేషన్ రాజకీయ వర్గాల్లో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

#RSS#Rashtriya Swayamsevak Sangh#RSS Gen Z Strategy#Operation Gen Z#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి