Harish Rao: రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు మాజీమంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు కరువు పరిస్థితులతో రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు ఆవేదన చెందుతుంటే.. మరోవైపు పండిన కాస్త పంటను అమ్ముకుందామంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం దారుణం అన్నారు. చాలా చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక దొడ్డు వడ్లు పండించిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పౌరసరఫరాల శాఖ మంత్రి, మార్కెటింగ్ శాఖ మంత్రి ఏం చేస్తున్నారని హరీశ్ రావు ప్రశ్నించారు.
లారీల ట్రాన్స్పోర్ట్ టెండర్లు, మిల్ అలాట్మెంట్ ఎప్పుడు?
ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, సిద్ధిపేట, మెదక్ తదితర జిల్లాల్లో.. అకాల వర్షాలతో ఐకేపీ సెంటర్లు, మార్కెట్ యార్డుల్లో ఉన్న ధాన్యం కొట్టుకుపోవడం, తడిసిపోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడా ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్ కవర్లు, మాయిశ్చర్ మీటర్లు కొనుగోలు కేంద్రానికి చేరలేదని హరీశ్ రావు ఆరోపించారు. కొన్న వడ్లను తరలించడానికి అవసరమైన లారీల ట్రాన్స్పోర్ట్ టెండర్లు ఇంతవరకు ఫైనల్ చేయలేదన్నారు. ఏ గ్రామం వడ్లు ఏ మిల్లుకు వెళ్లాలనే మిల్ అలాట్మెంట్ కూడా ఇప్పటికీ జరగలేదన్నారు.
యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
యుద్ధ ప్రాతిపదికన అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని.. ట్రాన్స్పోర్ట్ టెండర్లు, మిల్ అలాట్మెంట్ వెంటనే పూర్తి చేయాలని రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు హరీశ్ రావు. మార్కెటింగ్ శాఖలో ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చి ఖాళీలను భర్తీ చేయాలన్నారు. ఇంఛార్జ్ వ్యవస్థను రద్దు చేసి ప్రతి జిల్లాకు, ప్రతి మార్కెట్ యార్డుకు శాశ్వత అధికారులను నియమించాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రిని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డుల సొంత నిధులను ఆర్థిక శాఖ ఫ్రీజింగ్ లో పెట్టడంతో రెండేళ్లుగా మార్కెట్ యార్డుల్లో మరమ్మతులు జరగడం లేదన్నారు.
వెంటనే ఇన్పుట్ సబ్సిడీ అందించాలి
కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తే... తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పంట నష్ట వివరాలు సేకరించకుండా మొద్దు నిద్రపోతోందని హరీశ్ రావు విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 25 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులందరికీ ఇన్ పుట్ సబ్సిడీ అందించాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్ధిపేట మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హరీశ్ రావు ప్రారంభించారు.


