తెలంగాణ ఆర్టీసీ దోపిడీ మాములుగా లేదని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగలు వస్తే చాలు పూనకం వచ్చినట్టు ఇష్టానుసారంగా చార్జీలు పెంచుకుంటూ పోతోందని మండిపడుతున్నారు. ఇటీవల దసరా పండుగకు సుమారు వారం రోజుల పాటు అసలు చార్జీలపై 50 శాతం అదనంగా వసూలు చేసిన ఆర్టీసీ.. తాజాగా దీపావళి పండుగకు ఊరెళ్లే ప్రయాణికుల నుంచి కూడా వసూలు చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టీజీఎస్ ఆర్టీసీ తీరుతో ప్రయాణికుల జేబులకు చిల్లు పడుతోంది.పండుగ పూట కుటుంబంతో కలిసి సొంతూరుకు వెళ్లేందుకు ప్రయాణికులు జంకుతున్నారు. ఆర్టీసీలో భద్రత ఉంటుందని బస్ ఎక్కితే సాధారణ టికెట్ మీద 50 శాతం అదనంగా వసూలు చేస్తుండటంతో ఇంట్లో ముగ్గురు ఉంటే ‘వన్ వే’ ప్రయాణానికే సుమారు రూ.2 వేలు అవుతున్నాయని ప్యాసింజర్స్ వాపోతున్నారు. పండుగలు లేని సమయంలో JBS నుంచి కరీంనగర్‌కు గరుడ బస్సు సాధారణ టికెట్ ధర రూ.410గా ఉండగా.. ఇప్పుడు రూ.580 వసూలు చేస్తున్నట్టు తెలిసింది.

అయితే,గతంలో ఉగాది, వినాయకచవితి, దసరా పండుల సమయంలో స్పెషల్ బస్సులు వేసేవారు. దీపావళికి పెద్దగా రష్ కూడా ఉండదు. అలాంటిది స్పెషల్ బస్సులు కూడా వేయలేదు. అయినప్పటికీ టికెట్ చార్జీ మీద అదనంగా రూ.150 నుంచి 180 వసూలు చేస్తున్నట్టు ప్రయాణికులు మండిపడుతున్నారు. స్పెషల్ బోర్డు లేనప్పుడు ఎందుకు వసూలు చేస్తున్నారని ప్యాసింజర్స్ అడిగితే అంతా మేనెజ్మెంట్ నిర్ణయమని, ఇష్టం ఉంటే ఎక్కండి లేదా దిగిపోండి అంటూ ఆర్టీసీ సిబ్బంది దురుసుగా సమాధానం ఇస్తున్నట్టు ప్యాసింజర్స్ వాపోతున్నారు.
ప్రత్యేక సర్వీసులు లేకుండానే ఛార్జీల పెంపుపై ప్రయాణికుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. ఆర్టీసీ మాత్రం అవేవీ పట్టించుకోకుండా డబ్బులు దండుకునే పనిలో పడింది. ప్రతిసారి ఇలా దోపిడీ చేస్తుంటే ఆర్టీసీ బస్సులకు బదులు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తుందని పండుగ వేళ స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.ఆర్టీసీకి చెల్లించే చార్జీలో 70 శాతం చెల్లిస్తే ఏసీ కారులో తమ గమ్యస్థానానికి చేరుకుంటామని పేర్కొంటున్నారు.కేవలం హిందూ పండుగల సమయంలోనే ఎందుకు చార్జీలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి పురుష ప్యాసింజర్స్ నుంచి దోపిడీ చేస్తారా? అని భగ్గుమంటున్నారు. ఇదిలాఉంటే, పండుగల సమయంలో ఎక్స్‌ప్రెస్ బస్సులను తగ్గించడంతో టికెట్ చెల్లించి వెళ్లాల్సి వస్తోందని మహిళలు సైతం ఫైర్ అవుతున్నారు.


