తెలంగాణ

Telangana Politics : తెలంగాణలో బీజేపీ దూకుడు వర్కౌట్ అవుతుందా?

5 నిమిషాల పఠనం

దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బీజేపీ పార్టీకి బలమైన రాజకీయ పునాది ఉన్న రాష్ట్రం తెలంగాణ. అందుకే ఎప్పటినుంచో ఇక్కడ అధికార పీఠాన్ని దక్కించుకోవడమే ఏకైక లక్ష్యంగా కాషాయ దళం పావులు కదుపుతోంది.

Telangana Politics: దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బీజేపీ పార్టీకి బలమైన రాజకీయ పునాది ఉన్న రాష్ట్రం తెలంగాణ. అందుకే ఎప్పటినుంచో ఇక్కడ అధికార పీఠాన్ని దక్కించుకోవడమే ఏకైక లక్ష్యంగా కాషాయ దళం పావులు కదుపుతోంది. అయితే ఎన్నికల సమయంలో హడావుడి చేయడం, ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం అనే పాత పద్ధతికి స్వస్తి పలుకుతూ.. ఈసారి కమలనాథులు పూర్తి భిన్నమైన క్షేత్రస్థాయి వ్యూహంతో రంగంలోకి దిగారు. తాజాగా అధిష్టానం నియమించిన ఇన్‌ఛార్జ్‌లు తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి.

వచ్చామా.. వెళ్లామా అన్నట్టు కాకుండా..

గతంలో ఢిల్లీ నుంచి వచ్చే నేతలు కేవలం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయం లేదా హోటళ్లకే పరిమితమై, రివ్యూ మీటింగులు పెట్టి వెళ్లిపోయేవారనే విమర్శలు ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారింది. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, కో-ఇన్‌ఛార్జ్‌లుగా అభయ్ పాటిల్, రేఖా శర్మ, సహ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా దశరథ్‌లను నియమించిన బీజేపీ హైకమాండ్.. వారికి స్పష్టమైన టార్గెట్లను నిర్దేశించింది. ముఖ్యంగా సునీల్ బన్సల్ నెలకు కనీసం రెండు సార్లు తెలంగాణలో పర్యటిస్తూ, వచ్చిన ప్రతిసారీ రెండు మూడు రోజుల పాటు ఇక్కడే మకాం వేసి గ్రౌండ్ రియాలిటీని పరిశీలించనున్నారు. నాయకులందరూ రాజధానికే పరిమితం కాకుండా నేరుగా జిల్లాల బాట పట్టేలా కార్యాచరణ సిద్ధం చేశారు.

ఇన్‌ఛార్జ్‌ల మధ్య "వర్క్ డివిజన్"..

ఈసారి బీజేపీ వ్యూహంలో అత్యంత కీలకమైన అంశం "వర్క్ డివిజన్". అధికారికంగా ప్రకటించకపోయినా, అంతర్గతంగా నలుగురు నేతలకు బాధ్యతలను పక్కాగా పంచేసుకున్నారు. రేఖా శర్మ పార్టీ బలహీనంగా ఉన్న దక్షిణ తెలంగాణ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. మహిళా మోర్చా, మైనారిటీ మోర్చా, ఎస్సీ మోర్చాల బాధ్యతలను చూస్తూ ఆయా వర్గాలను పార్టీ వైపు తిప్పే పనిలో ఉన్నారు. ఇక అభయ్ పాటిల్ పని విషయానికి వస్తే తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన ఓబీసీ మోర్చా, కిసాన్ మోర్చా బాధ్యతలతో పాటు పలు జిల్లాల వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. దశరథ్ వరంగల్ కేంద్రంగా చుట్టుపక్కల జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ పట్టును బిగించడం, అలాగే యువ మోర్చా, ఎస్టీ మోర్చాల ద్వారా కేడర్‌ను యాక్టివ్ చేసే బాధ్యతను బుజాలకెత్తున్నారు.

ఈ దూకుడు క్షేత్రస్థాయిలో ఫలిస్తుందా?

ఒక చిన్న రాష్ట్రానికి ఇంతమంది కీలక జాతీయ నేతలను మోహరించి, మోర్చాల వారీగా, ప్రాంతాల వారీగా బాధ్యతలు అప్పగించడం బీజేపీ సీరియస్‌నెస్‌కు నిదర్శనం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో, మరోవైపు బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకునేందుకు పోరాడుతున్న వేళ.. అసలైన ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించి అధికార దిశగా అడుగులు వేయాలన్నది కమలనాథుల ప్లాన్.

అయితే ఢిల్లీ నేతల మైక్రో మేనేజ్‌మెంట్ స్థానిక నేతల అంతర్గత విభేదాలను చక్కదిద్దగలదా? క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకుగా మారేలా ఈ వ్యూహాలు పనికొస్తాయా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం మొదలైన ఈ సంస్థాగత దూకుడు చూస్తుంటే మాత్రం.. తెలంగాణలో ఈసారి బీజేపీ చాలా సీరియస్‌గానే యుద్ధానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది.

#Telangana Politics#Telangana BJP#BJP Telangana#Sunil Bansal#Abhay Patil#Rekha Sharma#Dasarath#Telangana BJP Strategy#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి