తెలంగాణ

MaheshKumar Goud: సౌమ్యుడైన పీసీసీ చీఫ్‌కు ఎందుకు కోపమొచ్చింది?

6 నిమిషాల పఠనం

MaheshKumar Goud: తెలంగాణలో కాంగ్రెస్‌కి అధికారం దక్కిన వేళ కన్పించిన ఐక్యత.. రోజులు గడిచేకొద్దీ అంతర్గత ఆధిపత్య పోరుగా రూపాంతరం చెందుతోంది. జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పట్టు నిలుపుకునేందుకు వేస్తున్న ఎత్తులు, పైఎత్తులు చివరకు గాంధీభవన్ చుట్టూ ముసురుకుంటున్నాయి.

MaheshKumar Goud: తెలంగాణలో కాంగ్రెస్‌కి అధికారం దక్కిన వేళ కన్పించిన ఐక్యత.. రోజులు గడిచేకొద్దీ అంతర్గత ఆధిపత్య పోరుగా రూపాంతరం చెందుతోంది. జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పట్టు నిలుపుకునేందుకు వేస్తున్న ఎత్తులు, పైఎత్తులు చివరకు గాంధీభవన్ చుట్టూ ముసురుకుంటున్నాయి. ఇప్పటివరకు ఇలాంటి వివాదాలు ఎన్ని ఎదురైనా సంయమనంతో వ్యవహరిస్తూ, అందరితో సౌమ్యంగా ఉంటారనే గుర్తింపు తెచ్చుకున్న టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు అనూహ్యంగా దూకుడు పెంచారు. పార్టీలో తారస్థాయికి చేరిన గ్రూపు తగాదాలు, బాహాటంగా నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన ఏకంగా ఏఐసీసీ పెద్దలకే ప్రాథమిక నివేదికను పంపడం హస్తం వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

పిలిచినా రాలేదు.. తీవ్రంగా పరిగణించిన పీసీసీ

ఈ నివేదికలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిన అంశం మంత్రి దామోదర రాజనర్సింహ వైఖరి. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతో మంత్రికి తలెత్తిన విభేదాలు పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో, వివాదాన్ని పరిష్కరించేందుకు పీసీసీ అధ్యక్షుడి హోదాలో మహేష్ గౌడ్ ఇద్దరినీ గాంధీభవన్‌కు పిలిపించారు. అయితే, అధిష్టాన ప్రతినిధిగా స్వయంగా పీసీసీ చీఫ్ పిలిచినప్పటికీ మంత్రి దామోదర రాజనర్సింహ గాంధీభవన్‌కు రాకుండా డుమ్మా కొట్టారు.

పార్టీ అధ్యక్షుడి హోదాలో పంపిన పిలుపును సైతం ఖాతరు చేయకపోవడాన్ని మహేష్ గౌడ్ తీవ్రమైన క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించినట్లు తెలుస్తోంది. పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదనే సంకేతం ఇచ్చేలా, ఈ విషయాన్ని స్పష్టంగా వివరిస్తూ హైకమాండ్‌కు ప్రత్యేక లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఆధారాలతో సహా ఢిల్లీకి నివేదిక.. కీలక నేతల పేర్లు

మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి సమర్పించిన నివేదికలో కేవలం ఫిర్యాదులు మాత్రమే కాకుండా, నేతలు చేసిన కామెంట్లకు సంబంధించిన పూర్తి ఆధారాలను జతచేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రితో పాటు మంత్రులను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న కామెంట్లు పార్టీ శ్రేణుల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. ఆయన బహిరంగంగా మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో క్లిప్పింగులను నివేదికతో పాటు నేరుగా మెయిల్ ద్వారా అధిష్టానానికి పంపినట్లు చెబుతున్నారు.

మరోవైపు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి రాజకీయంగా నష్టం కలిగించడమే కాక, ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశాన్ని ఇచ్చాయని నివేదికలో ఎత్తిచూపారు. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య సాగుతున్న అంతర్గత విభేదాలపైనా పూర్తి సమాచారం కూడా అందజేశారు. మొదట వీరిద్దరినీ కూడా గాంధీభవన్‌కు పిలిపించి మాట్లాడాలని పీసీసీ భావించినప్పటికీ, అంతకుముందు మంత్రి దామోదర వ్యవహారంలో ఎదురైన అనుభవంతో ఇక స్వయంగా పరిష్కరించే కంటే మొత్తం వ్యవహారాన్ని ఏఐసీసీ కోర్టులోనే తేల్చాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.

ఇక హైకమాండ్ చేతుల్లోనే అసలైన పంచాయితీ

పార్టీ చీఫ్ హోదాలో పిలిచినా మంత్రులు, ఎమ్మెల్యేలు గాంధీభవన్‌కు రాకపోవడాన్ని ఢిల్లీ పెద్దలు కూడా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాథమిక నివేదికను పరిశీలించిన అనంతరం, సమస్యలు నెలకొన్న జిల్లాల నేతలను నేరుగా ఢిల్లీకి పిలిపించి ఏఐసీసీ క్లాస్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హోదాలు, పదవులు ఉన్నంత మాత్రాన పార్టీ క్రమశిక్షణను దాటితే ఉపేక్షించేది లేదని హెచ్చరించేందుకు అధిష్టానం కఠిన చర్యలకు ఉపక్రమిస్తుందా? లేక సర్దుబాటు చేస్తుందా? అన్నది త్వరలోనే తేలనుంది. నివేదిక రూపంలో మహేష్ గౌడ్ వేసిన ఈ అడుగుతో తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ సమీకరణాలు ఏ మలుపు తిరుగుతాయోనన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

#Mahesh Kumar Goud#Mahesh Goud#Telangana Congress#TPCC Chief#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి