Ramchander Rao: 22ఏ నిషేధిత భూముల జాబితా వివాదం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. రాజకీయాలన్నీ ఈ అంశం చుట్టే తిరుగుతున్నాయి. 22ఏ వివాదంలో రేవంత్ సర్కార్ ను ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. 22ఏ పేరుతో భారీ స్కామ్ కి తెరలేపారని ఆయన ఆరోపించారు. 22ఏ వివాదంపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 22ఏ ను ప్రజలు భూతంలా చూస్తున్నారని చెప్పారు. ప్రజలను గందరగోళంలోకి నెట్టడానికే భూ భారతి తీసుకొచ్చారని మండిపడ్డారు.
''గత ప్రభుత్వంలో ధరణి వచ్చినప్పుడు కూడా ప్యూరిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ చేయాలని చెప్పాము. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్యూరిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ చేయాల్సి ఉంది. భూ భారతి, ధరణి.. ఈ రెండు చట్టాలు కూడా ప్రజలను గందరగోళంలోకి నెట్టేశాయి. ప్రజలు భయంతో ఉన్నారు. భూ భారతి, 22ఏ ను భూతంలా చూస్తున్నారు. ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వడం లేదు.
తప్పైపోయిందని అంటున్నారు, సరిదిద్దుతామంటున్నారు. దానికి ఒకటే పరిష్కారం. ధరణి కన్నా ముందున్న అన్ని రికార్డ్స్ ను యధావిధిగా పెట్టాలి. 22ఏ జాబితా కింద తీసుకొచ్చిన అన్ని భూములను ఫ్రీ హోల్డ్ చేయాలి. ఇప్పుడు 22ఏ కింద వచ్చిన భూములు, గతంలో ఉన్న ల్యాండ్స్ అన్నింటిపై సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది'' అని రాంచందర్ రావు అన్నారు.











