Andhra Devotee Dies: తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయం చుట్టూ సాగే గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యార్ ఆలయంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మోక్ష మార్గంలో ఇరుక్కుపోయి ఊపిరాడక ఒక భక్తుడు మృతి చెందాడు. దీంతో స్థానికంగా పెను విషాదం అలుముకుంది.
మృతుడిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మణికుమార్ గా గుర్తించారు. 36ఏళ్ల మణికుమార్ శుక్రవారం రాత్రి ఫ్యామిలీతో కలిసి తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి వెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో గిరిప్రదక్షిణ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇడుక్కు పిల్లయ్యార్ ఆలయానికి చేరుకున్నాడు. తెలుగు వారు దీన్ని మోక్ష మార్గంగా భావిస్తారు. ఈ ఆలయం గుహ ఆకారంలో ఉంటుంది. భక్తులు ఇరుకైన ద్వారం నుంచి పడుకుని పాకుతూ మరోవైపు నుంచి బయటకు వస్తుంటారు.
శరీరాన్ని వంచుతూ, మెలికలు తిప్పుతూ ఆ సన్నని దారి నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా శారీరక, మానసిక అనారోగ్యాలు తొలగిపోతాయని.. దైవానుగ్రహం, మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. మణికుమార్ సైతం మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. అయితే అతడు కొంచెం లావుగా ఉంటాడు. దాంతో ఇరుకైన మార్గంలో మధ్యలోనే చిక్కుకుపోయాడు. ఎంత ప్రయత్నం చేసినా బయటకు రావడం అతడి వల్ల కాలేదు.
ఈ ఊహించని పరిణామంతో మణి కుటుంబసభ్యులు కంగారు పడిపోయారు. ఏం చేయాలో వారికి పాలుపోలేదు. చివరికి ఇతర భక్తుల సాయంతో తీవ్రంగా శ్రమించి మణికుమార్ ను కుటుంబసభ్యులు బయటకు తీయగలిగారు. అయితే లోపల గాలి ఆడక మణికుమార్ స్పృహ కోల్పోయాడు. వెంటనే అంబులెన్స్‌లో అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే అతడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
అరుణాచలేశ్వర ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ మార్గం 14 కిలోమీటర్ల మేర ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసే భక్తులు సందర్శించే ప్రసిద్ధ ప్రదేశాలలో ఇడుక్కు పిళ్ళైయార్ ఆలయం ఒకటి. ఇడుక్కు పిల్లయ్యార్ ఆలయం చిన్న గుహ ఆకారంలో ఉంటుంది. భక్తులు వెనుకవైపు ఉన్న ప్రవేశ మార్గం ద్వారా పడుకుని లోపలికి వెళ్లి ఇరుకైన గుహలో పాకుతూ మరో ద్వారం నుంచి బయటకు వస్తారు. బయటకు వచ్చాక నంది, ఇడుక్కు పిల్లయ్యార్‌ను దర్శించుకోవడం ఆనవాయితీ. నిత్యం వేల మంది భక్తులు అరుణాచలేశ్వరుడి దర్శనానికి వస్తుంటారు. స్వామి వారిని దర్శించుకోవడంతో పాటుగా మోక్షం సిద్ధిస్తుందనే విశ్వాసంతో మోక్ష మార్గంలోకి వెళ్లి వస్తుంటారు.












