CJP: కేంద్ర ప్రభుత్వం, కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. సీజేపీ డిమాండ్లను కేంద్రం అంగీకరించింది. ఈ క్రమంలో సీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పేపర్ లీక్ కు నిరసనగా కొన్ని రోజులుగా చేస్తున్న ఆందోళనలను విరమిస్తున్నట్లు కాక్రోచ్ పార్టీ ప్రకటించింది. విద్యార్థులు తక్షణమే ఆందోళన విరమించి.. నిరసనకారులంతా క్షేమంగా తమ ఇళ్లకు చేరుకోవాలని సీజేపీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు మిగతా రెండు డిమాండ్లకు కేంద్రం అంగీకరించిందని సీజేపీ ప్రతినిధులు తెలిపారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ తో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్ లో సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోశ్ రంకా ఈ కీలక ప్రకటన చేశారు.
ప్రభుత్వంతో చర్చల అనంతరం 'కాక్రోచ్ జనతా పార్టీ' జాతీయ ప్రతినిధి అశుతోష్ రంకా మీడియాతో మాట్లాడారు. "మా డిమాండ్లన్నీ అంగీకరించబడ్డాయి. కాబట్టి నిరసనకారులు వెంటనే తమ ఆందోళనను విరమించి శాంతియుతంగా ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరుతున్నాము. భవిష్యత్తు కార్యాచరణ లేదా ఇతర అంశాల గురించి మేము మీకు తెలియజేస్తాము. కానీ, నిరసనకారులు వెంటనే వెనక్కి తగ్గాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము".
'కాక్రోచ్ జనతా పార్టీ' తన ఆందోళనను విరమించుకుంటున్నట్లు ప్రకటన చేసిన తర్వాత ఆ పార్టీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్, జాతీయ ప్రతినిధి అశుతోష్ రంకాలతో కేంద్ర మంత్రులు జె.పి. నడ్డా, జితేంద్ర సింగ్ కరచాలనం చేశారు.
'కాక్రోచ్ జనతా పార్టీ' ప్రతినిధి బృందంతో చర్చల అనంతరం కేంద్ర మంత్రి జె.పి. నడ్డా మీడియాతో మాట్లాడారు. "ఈ రోజు మేము సుదీర్ఘంగా చర్చించాము. సీజేపీ ప్రతినిధులు లిఖితపూర్వక ముసాయిదాను తీసుకొచ్చారు. అందులో ఆందోళనలకు సంబంధించిన కేసుల గురించి నాలుగు అంశాలను ప్రస్తావించారు. వాటితో పాటు ప్రతీకార చర్యలు తీసుకోకూడదని, పరిహారం అందించడం, ఐదు అంశాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ వారు లేవనెత్తిన ఇతర అంశాలపై కూడా మేము చర్చించాము.
వారికి ఎఫ్‌ఐఆర్ (FIR) కాపీలను అందిస్తాము. ఎటువంటి చర్యలూ తీసుకోము. ఇక పరిహారం విషయానికి వస్తే, ప్రభుత్వం తమకు కూడా సానుభూతి ఉందని స్పష్టంగా తెలియజేసింది. నిబంధనల ప్రకారం పరిహారం ఉంటుందని, సాధ్యమైనంత గరిష్ట మొత్తాన్ని వారికి అందిస్తామని చెప్పాము."
"సీజేపీ ప్రతినిధులు మాకు అందించిన ఐదు అంశాల విజ్ఞాపన పత్రం విద్యా పరీక్షలలో సంస్కరణలకు సంబంధించినది. విద్యా పరీక్షల సంస్కరణల కోసం సీజేపీ ఇచ్చిన విజ్ఞాపన పత్రంపై మేము లోతుగా ఆలోచిస్తాము. అలాగే సీజేపీ ప్రతినిధి బృందంతో చర్చించిన తర్వాత మా పరిధిలో సాధ్యమైనంత వరకు చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తాము. వారు లేవనెత్తిన డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, వాటిని అంగీకరించిందని నేను భావిస్తున్నాను" అని జేపీ నడ్డా అన్నారు.
ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి..












