భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అపూర్వ, చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఎర్రకోట వేదికగా జరిగిన అధికారిక వేడుకల్లో జాతీయ గేయం 'వందేమాతరం' పూర్తి గీతాన్ని అత్యంత వైభవంగా ఆలపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఈ ఉత్సవాల్లో ఆర్మీ బ్యాండ్ బృందం వందేమాతరం గీతాన్ని స్వరపరిచగా, ఆ తర్వాత యథావిధిగా జాతీయ గీతం 'జన గణ మన'ను ఆలపించారు. జాతీయ గేయం 'వందేమాతరం' రూపుదిద్దుకుని ఈ ఏడాదికి 150 వసంతాలు పూర్తి కావడం ఈ సందర్భానికి మరింత చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించిపెట్టింది.
వేడుకల ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట బురుజులపై జాతీయ జెండాను ఆవిష్కరించిన వెంటనే, 1721 ఫీల్డ్ బ్యాటరీ ఆధ్వర్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 105 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్స్‌తో 21 సార్లు గన్ సెల్యూట్ సమర్పించారు. ఆ వెంటనే ఆర్మీ బ్యాండ్ 'వందేమాతరం' పూర్తి గీతాన్ని వాయిస్తుండగా, భారత వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు ఎర్రకోట ఆవరణపై పూలవర్షం కురిపించాయి. ఇందులో ఒక హెలికాప్టర్‌పై త్రివర్ణ పతాకం, మరో హెలికాప్టర్‌పై 'వందేమాతరం' అని రాసి ఉన్న ప్రత్యేక పతాకం ఎగరడం ఆకట్టుకుంది. "స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎర్రకోట ప్రాకారాల నుంచి వందేమాతరం వినిపించడం ఇదే తొలిసారి" అని ప్రధాని మోదీ తన ప్రసంగంలో స్పష్టం చేశారు.
జాతీయ గీతంతో (జన గణ మన) సమానంగా వందేమాతరానికి కూడా పూర్తి చట్టపరమైన రక్షణ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల సవరణలు చేసిన నేపథ్యంలో ఈ విశేష ఘట్టం చోటుచేసుకుంది. 'జాతీయ గౌరవ అవమానాల నివారణ (సవరణ) బిల్లు-2026'కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొద్ది రోజుల క్రితమే ఆమోదముద్ర వేశారు. ఈ నూతన చట్టం ప్రకారం వందేమాతరం గీతాలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నా, లేదా గేయాన్ని అవమానించినా కఠిన జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు విధించేలా నిబంధనలను పొందుపరిచారు.
స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ముందు, ప్రసంగం ముగిసిన తర్వాత కూడా వందేమాతరం పూర్తి గీతాన్ని ప్రసారం చేయడం విశేషం. మన దేశ స్వదేశీ ఉద్యమ సమయంలో 'వందేమాతరం' గీతం ప్రతీ ఒక్క భారతీయుడి గొంతుకగా మారిందని రాష్ట్రపతి గుర్తుచేశారు. ఈ కొత్త చట్టం, ఎర్రకోటపై పూర్తి గీతాలాపనతో జాతీయ గేయానికి జాతీయ గీతంతో సమానమైన ఉన్నత గౌరవం, చట్టబద్ధ రక్షణ లభించినట్లయింది.
ఇన్నిరోజులు జాతీయ గేయాన్ని పూర్తిగా చదవకపోవడానికి కారణమిదే..
'వందేమాతరం' పూర్తి గేయాన్ని కాకుండా సుదీర్ఘకాలం పాటు తొలి రెండు చరణాలకే పరిమితం చేయడం వెనుక బలమైన చారిత్రక, రాజకీయ కారణాలున్నాయి. 1875లో బంకిం చంద్ర ఛటర్జీ రచించిన ఈ గేయంలోని తొలి రెండు పాదాలు కేవలం భారత మాత ప్రకృతి రమణీయతను, నిత్య సమృద్ధిని వర్ణిస్తాయి. అయితే తర్వాతి చరణాల్లో మాతృభూమిని దుర్గాదేవి ప్రతిరూపంగా కొలుస్తూ ఆధ్యాత్మిక పదజాలాన్ని ఉపయోగించడం వల్ల, దేశంలోని వివిధ మతాల ఆమోదయోగ్యతపై అప్పట్లో చర్చ లేచింది.
ఈ క్రమంలో స్వాతంత్ర్యోద్యమ కాలంలో ప్రజలందరినీ ఏకం చేయాలనే ఉద్దేశంతో, 1937లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చిన సలహాను అనుసరించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) కేవలం మొదటి రెండు చరణాలనే అధికారిక కార్యక్రమాల్లో ఆలపించాలని నిర్ణయం తీసుకుంది. అనంతరం 1950లో రాజ్యాంగ పరిషత్ కూడా ఈ రెండు చరణాలకే జాతీయ గేయంగా (National Song) చట్టబద్ధమైన ప్రాధాన్యతనివ్వడంతో, దశాబ్దాలుగా అధికారికంగా ఆ భాగం మాత్రమే ప్రచారంలో ఉంటూ వచ్చింది.


