తెలంగాణ

32 నెలల మార్కు.. రికార్డుల దిశగా తెలంగాణ: సీఎం రేవంత్ బిగ్ స్టేట్‌మెంట్!

రచన: Mamatha puppala••5 నిమిషాల పఠనం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. హైదరాబాద్‌లోని చారిత్రాత్మక గోల్కొండ కోటలో నిర్వహించిన అధికారిక ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. హైదరాబాద్‌లోని చారిత్రాత్మక గోల్కొండ కోటలో నిర్వహించిన అధికారిక ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించారని గుర్తుచేసిన సీఎం, ఆయన దూరదృష్టితో నెలకొల్పిన ప్రాజెక్టుల ఫలాలను నేటికీ దేశ ప్రజలు అనుభవిస్తున్నారని కొనియాడారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 32 నెలల కాలంలో సాధించిన ప్రగతి మరియు మార్పులు ఇప్పుడిప్పుడే స్పష్టంగా కనిపిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశ సగటు తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 92 శాతం అధికంగా ఉందని వెల్లడించారు. వ్యవసాయాన్ని పండగ చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొంటూ, రైతు భరోసా పథకం ద్వారా రూ.36,000 కోట్లు అందించామని, మొత్తంగా రైతు సంక్షేమం కోసమే రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. దీంతో రాష్ట్రం ధాన్యం ఉత్పత్తిలో సరికొత్త రికార్డులను అధిగమించిందని హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్ర నీటి హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ త్వరలోనే పూర్తి చేస్తామని, అందులో భాగంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి సాగునీరు అందిస్తామన్నారు. వ్యవసాయ రంగానికి, గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలను వివరిస్తూ.. కల్యాణలక్ష్మి కింద ఆడబిడ్డలకు రూ.4,790 కోట్లు పంపిణీ చేశామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చే లక్ష్యంతో ఆర్టీసీ అద్దె బస్సులకు వారిని యజమానులుగా తీర్చిదిద్దినట్లు ప్రకటించారు.

పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్తగా 15 లక్షలకు పైగా మంజూరు చేసిన రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. అలాగే కొత్తగా 2.50 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. రెండో విడతలో 5.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, పట్టణ పేదల కోసం ఇందిరమ్మ టవర్లు నిర్మిస్తున్నామన్నారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కులగణన విజయవంతంగా పూర్తి చేశామని, దీని ప్రభావంతోనే కేంద్రం కూడా జనగణనలో కులగణనను చేర్చిందని స్పష్టం చేశారు. గిగ్ కార్మికుల సంక్షేమానికి చట్టం తీసుకువచ్చామని, త్వరలోనే సినీ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని ఎర్రకోట తరహాలో గోల్కొండ వేదికగా సీఎం హామీ ఇచ్చారు.

 

#CM Revanth Reddy Independence Day Speech#Golconda Fort Flag Hoisting#Telangana 80th Independence Day#Revanth Reddy 32 Months Governance#Telangana Ration Cards Scheme#Indiramma Indlu Telangana#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి