ప్రభుత్వాలు మారినా రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు మాత్రం మెరుగవడం లేదు. ప్రజలు కట్టే పన్నులను ప్రభుత్వం ఏదో రకంగా వాడుకుంటోంది కానీ మెరుగైన సౌకర్యాలు, మంచి రవాణా సదుపాయాలు కల్పించడంతో మాత్రం విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు అధికారంలో ఉన్నా నగరంలో రోడ్లు మాత్రం అధ్వాన్నంగానే ఉన్నాయి. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్ల విస్తరణ, రోడ్డు సదుపాయం లేని ప్రాంతాల్లో వేయడం, వాటిని మరింత మెరుగుపరచడం వంటి చర్యలు చేపట్టడంలో ఘోరంగా విఫలమైందని విమర్శలున్నాయి.
ప్యాచ్ వర్క్ సరిపోతుందా?
నగరంలో రోడ్లు డ్యామేజ్ అయితే కేవలం ప్యాచ్ వర్క్ చేసి వదిలేస్తున్నారు. అక్కడ కొత్త రోడ్డు మాత్రం వేయడం లేదు.దీనిపై నగరవాసుల నుంచి తీవ్ర ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి.వర్షం పడినప్పుడు గుంతల్లో నీరు నిల్వడం, రోడ్లపై వరద ప్రవాహం వలన వాహనదారులకు రోడ్డు క్లియర్‌గా తెలియడం లేదు. ఫలితంగా వాహనం గుంతల్లోకి వెళ్లడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్యాచ్‌తో సరిపెట్టకుండా కొత్త రోడ్లు వేయాలని, వైడెనింగ్ కూడా చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ప్రమాదాలకు కేరాఫ్..
ఇదిలాఉంటే హైదరాబాద్‌లోని బడంగ్పేట్ మున్సిపాలిటీలో ప్రధాన రోడ్డు అధ్వాన్నంగా మారింది. మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో బీరప్ప కాలనీవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.రోజుకు రెండు, మూడు ప్రమాదాలు జరుగుతున్నాయని, జీహెచ్ఎంసీకి విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే లేడని స్థానికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలోనే రోడ్లు వేస్తామని చెప్పడం తప్పా ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికుల మండిపడుతున్నారు.
రెండు నెలల క్రితం మట్టిని తవ్వించి వారం రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటిదాకా పనులు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండున్నరేళ్ల క్రితం మంత్రి శ్రీధర్ బాబు మున్సిపల్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు 100 మీటర్ల మేర రోడ్డు మాత్రమే వేశారని స్థానికులు చెబుతున్నారు. ఆ కార్యక్రమం జరిగి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా బీరప్ప కాలనీ అంతర్గత రోడ్లను పట్టించుకోలేదని కాలనీ వాసులు ఆరోపించారు. నాయకులు, అధికారులు తమ బాధ పట్టించుకోవడం లేదని,ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.


