అదృష్టం ఎవరిని, ఎప్పుడు, ఎలా వరిస్తుందో ఎవరూ ఊహించలేరు. పంజాబ్‌కు చెందిన ఓ నిరుపేద దినసరి కూలీ భార్య జీవితాన్ని కేవలం రూ.7లక్కీ డిప్ టికెట్ పూర్తిగా మార్చివేసింది. పిల్లల కోసం దుస్తులు కొనేందుకు బజారుకు వెళ్లిన ఆమె, మార్గమధ్యంలో సరదాగా కొన్న లాటరీ టికెట్‌తో ఏకంగా రూ.కోటి జాక్‌పాట్ గెలుచుకున్నారు. పంజాబ్‌లోని కోట్కపురా (Kotkapura) ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ అరుదైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
కోట్కపురా ప్రాంతానికి చెందిన బిమ్లా దేవి భర్త రోజువారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఆయనకు వచ్చే అరకొర సంపాదనతో ఆ కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే బిమ్లా దేవి తన పిల్లల కోసం దుస్తులు కొనుగోలు చేసేందుకు స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని స్టార్ లాటరీ స్టాల్ వద్దకు వెళ్లింది. అక్కడ సిక్కిం ప్రభుత్వం నిర్వహించే లాటరీలో కేవలం రూ.7 వెచ్చించి ఒక టికెట్ కొనుగోలు చేసింది.
ఆ చిన్న మొత్తమే తన కష్టాలను తీరుస్తుందని ఆమె కలలో కూడా ఊహించలేదు. మరుసటి రోజు లాటరీ ఫలితాలు రాగా, బిమ్లా దేవి కొన్న టికెట్‌కు ప్రథమ బహుమతిగా రూ.కోటి సంపద దక్కింది. ఈ విషయాన్ని లాటరీ స్టాల్ నిర్వాహకుడు నరేశ్ మోంగా స్వయంగా ఫోన్ చేసి తెలపడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వెంటనే దుకాణానికి చేరుకున్న కుటుంబ సభ్యులు స్థానికులతో కలిసి స్వీట్లు పంచుకుంటూ, భాంగ్రా నృత్యాలు చేస్తూ తమ సంతోషాన్ని ఘనంగా వ్యక్తపరిచారు.
దినసరి కూలీగా ఎన్నో కష్టాలు పడిన తమకు ఈ అదృష్టం దేవుడు ఇచ్చిన వరమని బిమ్లా దేవి కంటతడి పెట్టుకున్నారు. వచ్చిన కోటి రూపాయల బహుమతితో తమ పిల్లల ఉన్నత చదువులకు భరోసా ఏర్పడిందని, త్వరలోనే కుటుంబ సభ్యులతో చర్చించి ఏదైనా చిన్నపాటి వ్యాపారం ప్రారంభించి తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటామని ఆమె తెలిపారు. గత ఆరు నెలలుగా తాను లాటరీ వ్యాపారం నిర్వహిస్తున్నానని, తన స్టాల్ చరిత్రలో రూ.కోటి భారీ బహుమతి గెలుచుకోవడం ఇదే తొలిసారమని నిర్వాహకుడు నరేశ్ మోంగా ఆనందం వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబానికి అదృష్టం ఇలా వరించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


