సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున ఇండస్ట్రియల్ ఏరియాలోని 'సరాక' రసాయన పరిశ్రమలో (Saraka Chemical Industry) ఒక్కసారిగా గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్ లీకేజీకి అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రాణాంతక ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని కార్మికులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో సుదర్శన్ రావు (27), బాలాజీ (44) అనే కార్మికులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పరిశ్రమల యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరి వల్లే నిండు ప్రాణాలు బలవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సమగ్ర న్యాయం చేయాలని, బాధ్యులైన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి: హరీశ్‌రావు
ఈ దుర్ఘటనపై రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే కార్మికులు బలవుతున్నారని ఆయన మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు తక్షణమే రూ.కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీలలో భద్రతా ఆడిట్‌ను కఠినతరం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని పారిశ్రామిక వాడల్లో నామమాత్రపు తనిఖీలు, సేఫ్టీ రూల్స్ పాటించని కంపెనీల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరుస ప్రమాదాలతో కార్మిక కుటుంబాలు వీధిన పడుతున్న తరుణంలో, ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే.


