ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రస్తుతం నెలకొన్నరాజకీయ పరిస్థితులపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. నామినేషన్ల టైంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై జగన్ మీడియాతో మాట్లాడారు. నామినేషన్ పత్రాలను చించేయడం,కేంద్రాల వద్ద వైసీపీ అభ్యర్థులపై దాడులను తీవ్రంగా ఖండించారు. నామినేషన్ల వేయకుండా వైసీపీ నేతలను హౌస్ అరెస్టులు చేయడంతో పాటు పోలీస్ స్టేషన్లకు పిలిపించి మరీ ముందస్తు అరెస్టులు చేశారన్నారు.
సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా..
ప్రజాస్వామ్యాన్ని సీఎం చంద్రబాబు పూర్తిగా ఖూనీ చేస్తున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో పాల్పడిన అక్రమాలు, దాడులపై అన్ని ఆధారాలను సేకరించి ఎస్ఈసీకి, గవర్నర్‌కు సమర్పించామన్నారు. ఈ అన్యాయాలపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించామని తెలిపారు. తమ వాదనలతో ఏకీభవించిన సర్వోన్నత న్యాయస్థానం కూటమి ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసే వాతావరణం కల్పించాలని, వారికి తగిన రక్షణ, బందోబస్తు కల్పించడంతో పాటు నామినేషన్ కేంద్రాల వద్ద సీసీ టీవీ రికార్డింగ్ చేయాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన విషయాన్ని జగన్ గుర్తుచేశారు.
కోర్టు ఆదేశాలు బేఖాతరు..
సుప్రీంకోర్టు ఇన్ని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ సీఎం చంద్రబాబు తీరులో ఏ మార్పు రాలేదన్నారు. ముఖ్యమంత్రి చేతిలో తోలుబొమ్మలా డీజీపీ, డీఐజీలు, ఎస్పీలు, కలెక్టర్లు ఉన్నారని ఆరోపించారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను వారు పట్టించుకోవడం లేదని, బేఖాతరు చేస్తూ నామినేషన్లను అడ్డుకుంటున్నారని వెల్లడించారు.దీనిని బట్టి రాష్ట్రంలో వ్యవస్థలు ఎంతగా దిగజారిపోయాయో అర్థమవుతోందన్నారు. ప్రభుత్వంలో పారదర్శకంగా పాలన అందించామని, ప్రజలకు మంచి చేశామనే నమ్మకం కూటమి సర్కారుకు ఉంటే ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్లను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు.
మొత్తం 19 మున్సిపాలిటీల్లో వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని జగన్ పేర్కొన్నారు. ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా ఎస్ఈసీ కేవలం మైదుకూరు, తిరుపతి (18 వార్డులు), కడప (11 వార్డులు), రాజంపేట (11 వార్డులు) వంటి కొన్ని చోట్ల మాత్రమే రీ-నామినేషన్లకు అవకాశం ఇచ్చిందన్నారు. కడపలో 66 వార్డులు, రాజంపేటలో 32 వార్డులు ఉంటే కేవలం 11 వార్డుల్లో మాత్రమే రీ-నామినేషన్‌కు అనుమతి ఇవ్వడం.. చంద్రబాబు ఏకపక్షంగా గెలిచేందుకు చేసిన కుట్ర అని ఆరోపించారు. 23 అర్బన్ లోకల్ బాడీస్‌లో పోటీనే లేకుండా చేయడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు.
జంగిల్ రాజ్ పాలన..
మహాభారతంలో శకునిలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయనే స్వయంగా రూల్స్ సెట్ చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్ వంటి విపత్తుల్లోనూ ప్రజలకు మేలు చేశామని, 90 శాతం హామీలను నెరవేర్చి ధైర్యంగా ఎన్నికలకు వెళ్లామని గుర్తుచేశారు.కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్లు అమలవ్వక ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు నిలదీస్తారనే భయంతోనే నామినేషన్ల కేంద్రాల వద్ద రిగ్గింగ్‌లు, దాడులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. బిహార్‌ను మించిన 'జంగిల్ రాజ్' పాలన రాష్ట్రంలో నడుస్తోందని విమర్శించారు.


