తెలంగాణ

రైస్ మిల్లర్లపై విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ నిఘా.. వెలుగులోకి భారీ కుంభకోణం!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అక్రమ రేషన్ దందా, ధాన్యం రీ-సైక్లింగ్ మిల్లింగ్ అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్ ఫోర్స్ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ధాన్యం నిల్వలు, మిక్సింగ్ ప్రక్రియలపై రాష్ట్ర సరిహద్దులతో పాటు వివిథ జిల్లాల్లోని రైస్ మిల్లులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.

  • రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నంలో ఆధారాలు..

  • సిద్ధిపేట జిల్లా మోతెలోని 'భారతి ఇండస్ట్రీస్'పై మెరుపు దాడులు

  • 42వేల క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యం మాయం..

  • పరారీలో మిల్లు యజమానులు.. గాలింపు చర్యలు ముమ్మరం

  • పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు: అధికారుల హెచ్చరిక

 తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అక్రమ రేషన్ దందా, ధాన్యం రీ-సైక్లింగ్ మిల్లింగ్ అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్ ఫోర్స్ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ధాన్యం నిల్వలు, మిక్సింగ్ ప్రక్రియలపై రాష్ట్ర సరిహద్దులతో పాటు వివిథ జిల్లాల్లోని రైస్ మిల్లులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ రైస్ మిల్లుపై అధికారులు దాడులు చేయగా, అక్కడ దొరికిన ఆధారాలతో సిద్ధిపేట జిల్లాలో నడుస్తున్న అక్రమ రేషన్ దందా బట్టబయలైంది. 

 ఇబ్రహీంపట్నం దాడుల్లో విచారణ ఎదుర్కొన్న మిల్లర్ ఇచ్చిన సమాచారంతో, అధికారులు సిద్ధిపేట జిల్లా మోతె సమీపంలోని 'భారతి ఇండస్ట్రీస్' రైస్ మిల్లుపై విజిలెన్స్ విభాగం మెరుపు దాడులు చేపట్టింది. మిల్లులోని స్టాక్ రిజిస్టర్లు, వాస్తవ నిల్వలను సమగ్రంగా పరిశీలించగా ఏకంగా 42వేల క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఉచితంగా పేదలకు పంపిణీ చేయాల్సిన ఈ భారీ కేటాయింపులను రైస్ మిల్లు యాజమాన్యం పక్కదారి పట్టించి, బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది.

 ఈ భారీ కుంభకోణానికి బాధ్యులైన భారతి ఇండస్ట్రీస్ యాజమాన్యంపై సివిల్ సప్లైస్, పోలీస్ అధికారులు తీవ్ర క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సీజ్ చేసిన మిల్లు నుంచి పత్రాలను స్వాధీనపరచుకుని, అక్రమ దందాలో భాగస్వాములైన వారి జాబితాను సేకరిస్తున్నారు. కాగా, పోలీసు కేసు నమోదు కావడంతో భారతి ఇండస్ట్రీస్ యజమానులు, ముఖ్య నిర్వాహకులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

 వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి సరఫరా చేస్తున్న రేషన్ ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, రాష్ట్రంలోని ప్రతి రైస్ మిల్లులోనూ డిజిటల్ ఆడిటింగ్, కఠినమైన తనిఖీలు కొనసాగుతాయని టాస్క్ ఫోర్స్ అధికారులు హెచ్చరించారు.

#TelanganaRiceMillScam#SiddipetRiceMillRaid#VigilanceTaskForceTG#BharatiIndustriesMothe#PDSBiyyamScam2026#TelanganaNews2026#RegionalNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి