రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ(ED) దాడులు కలకలం రేపాయి. శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, మోసపూరిత పెట్టుబడుల యాప్స్ ద్వారా సామాన్యులను బురిడీ కొట్టిస్తూ రూ.వందల కోట్లు కొల్లగొడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలపై ఈడీ దాడులు చేసింది. నిందితులపై మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసి సోదాలు జరుపుతున్నారు.స్పాట్‌లో దొరికిన విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
ఒకేసారి 15 ప్రాంతాల్లో సోదాలు..
హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు అనగా మొత్తం 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్రలోని పూణె సైబర్ క్రైమ్ పీఎస్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా అక్రమ నెట్‌వర్క్ మూలాలను సేకరించే పనిలో ఈడీ అధికారులు నిమగ్నమయ్యారు. కీలక నిందితుల నివాసాలు, వారి కార్యాలయాల్లో ఈడీ బృందాలు సోదాలు జరుపుతున్నాయి. అక్కడ లభ్యమైన రికార్డులు, ఆర్థిక లావాదేవీల పత్రాలు, డిజిటల్ పరికరాలను లోతుగా పరిశీలిస్తున్నారు.
ఈడీ సోదాల్లో భారీగా నగదు, పలు బ్యాంకు ఖాతాల వివరాలు, అంతర్రాష్ట్ర హవాలా నెట్‌వర్క్‌కు సంబంధించిన ఆధారాలు లభ్యమైనట్టు తెలుస్తోంది. గత వారమే ఉత్తరాదిలోని ఢిల్లీ, ముంబై, గుర్గావ్‌లలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు.. నార్త్ ఇండియా సోదాల్లో దొరికిన లింకులతో తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ఏజెంట్లు, హవాలా ఆపరేటర్లపై ఫోకస్ పెట్టారు.
బెట్టింగ్ సొమ్మును షెల్ కంపెనీలు, క్రిప్టోకరెన్సీల ద్వారా విదేశాలకు తరలించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.కీలక నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో రికార్డులు, లావాదేవీల పత్రాలు, డిజిటల్ పరికరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. సోదాల్లో భారీగా నగదు, బ్యాంకు ఖాతాలు, హవాలా నెట్‌వర్క్ ఆధారాలు లభ్యమైనట్టు తెలుస్తోంది. కాగా, ఈడీ దాడులకు సంబంధించిన పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది.


