రాజకీయాల్లో పాదయాత్రల సెంటిమెంట్ కు ఎక్కడలేని క్రేజ్ ఉంది.. ఇలా ఎందరు పాదయాత్రలు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం క్షేత్రస్థాయిలో పాదయాత్రను ఒక శక్తివంతమైన ఎన్నికల వ్యూహంగా మలచుకుని, నేరుగా సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు.. ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు, చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ వ్యూహాన్ని అనుసరిస్తూ 2012-13లో దాదాపు 2,817 కిలోమీటర్ల వరకు వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేశారు.
అదేవిధంగా 2017-19 మధ్య కాలంలో జగన్ మోహన్ రెడ్డి సైతం 3,648 కిలోమీటర్లు ప్రజా సంకల్ప యాత్ర పేరిట సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్ర ద్వారా సాధించిన ప్రజాదరణతో 2019 ఎన్నికలలో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర నిర్వహించి, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు..
అలా పాదయాత్రలకు క్రేజ్ ఏర్పడిందని అంటారు. మరోవైపు ఏపీ సీఎం గా జగన్ అధికారం చేపట్టినప్పుడు.. పాదయాత్రతో ప్రజల కష్టాలు తెలుసుకుని వారిలో ఒకరిగా కలిసిపోయిన విధానంతో ఆయన సీఎం అవగానే ప్రజలు భారీ అంచనాలు పెట్టుకున్నట్టు చెబుతారు.. కానీ పదవి చేపట్టాక వైసీపీ నేతల వ్యవహారశైలి, జగన్ అనుసరిస్తున్న పాలన విధానం ఏపీ ప్రజలను అంతగా ఆకర్షించలేక పోయినట్టు ప్రచారం జరిగింది.
ఆయన పార్టీని బలోపేతం చేయడంలో విఫలం అయినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.. ఇదేసమయంలో అధికార పక్షం, ప్రతి పక్షాల నేతల మధ్య మాటల యుద్ధం చేతల వరకు వెళ్ళి.. జగన్ హాయమంలో మళ్ళీ ఫ్యాక్షనిజంకు తెరలేపుతున్నారనే విమర్శలు మొదలైయ్యాయి.. అదీగాక జగన్ పాలన ఏపీ అభివృద్ధి కంటే.. ప్రత్యర్థుల పై దాడులు చేపించడం.. అవినీతిని ప్రోత్సహించడం పైనే దృష్టి సారిస్తున్నట్టు జనం భావించారు.. ఆ సమయంలో ఎదురైన సంఘటనలు కూడా వీటికి నిదర్శనంగా మారినట్టు చెబుతారు..
ఇక పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న రాజకీయ నిర్ణయాలు, కుటుంబంలో తలెత్తిన విభేదాలు, ప్రజల్లో ఏర్పడిన ప్రతికూల అభిప్రాయాలు, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు ఎదురవుతున్న ఇబ్బందులు.. ఇవన్నీ కలిపి వైసీపీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయనే భావన మొదలైనట్టు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.. సరే ఏపీలో ఏర్పడిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వైసీపీ ఓటమి మూటగట్టుకుంది. కానీ అధికార పక్షం పాలన తీరుపై ప్రజల్లో తమ గళాన్ని వినిపించే స్థాయిలో కూడా జగన్ విఫలం అయ్యాడనే ఆరోపణలున్నాయి..
మొత్తంగా కూటమి వ్యూహాలకు వైసీపీ కుదేలై నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిందనేది ప్రజల్లో బలంగా నాటుకున్నట్టు చెబుతారు.. ముఖ్యంగా జగన్ ఇచ్చిన హెచ్చరికలు ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి స్థానంలోనూ పోటీ చేయాలని, ఎక్కడా ఏకగ్రీవాలకు సహకరించవద్దని పార్టీ నాయకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు ప్రచారం జరిగింది.
అయితే ఈ నిర్ణయం జగన్ వ్యూహంలో భాగం కావచ్చు.. వైసీపీ పార్టీ శ్రేణుల్లో పోరాట స్ఫూర్తిని నింపడం, కూటమి ప్రభుత్వానికి తలవంచే ప్రసక్తే లేదనే సంకేతాలు పంపడం ఆయన లక్ష్యం అయి ఉండవచ్చు.. కానీ క్షేత్రస్థాయిలో దాని వల్ల వచ్చే పరిణామాలను కూడా అంచనా వేయగలగాలి.. ఒక నిర్ణయం పార్టీతో పాటు, కార్యకర్తల పై ఎలాంటి ప్రభావం చూపుతుంది. కోల్పోయిన వైభవం తీసుకు రావడంలో ఆ వ్యూహాలు ఏమేరకు ఫలిస్తాయనే ముందు చూపు ఉన్నప్పుడే ప్రత్యర్థుల కట్టడికి సాధ్యం అవుతుంది.
కానీ ఇక్కడే జగన్ వ్యూహం బెడిసికొట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా కాదు.. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్త ప్రచారం, నాయకుడి ఇమేజ్, సంక్షేమ పథకాలు, కూటముల బలం కీలకంగా ఉంటాయి. కానీ స్థానిక ఎన్నికల్లో అభ్యర్థికి గ్రామంలో ఉన్న సంబంధాలు, ఆర్థిక స్థోమత, స్థానిక నాయకుల మద్దతు, స్థానిక ఆధిపత్యం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయి.
అయితే జగన్ మాత్రం ప్రతి స్థానంలో పోటీ చేయాలనే లక్ష్యాన్ని నిర్ణయించడం.. ఏకగ్రీవాలకు సహకరించిన నాయకులకు భవిష్యత్తులో ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వబోమని హెచ్చరించడం.. వంటి చర్యలు పార్టీ నాయకత్వంలో ఒత్తిడిని పెంచాయనే అభిప్రాయం ఏర్పడినట్టు తెలుస్తుంది. అదీగాక పోటీ చేసే అభ్యర్థులు సొంత ఖర్చులతోనే బరిలోకి దిగాలని.. పార్టీ తరపున ఎలాంటి నిధులు ఉండవని కూడా చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది.
ఈ క్రమంలో సాధారణంగా అధికార పార్టీకే విన్నింగ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులో వైసీపీ మీద ప్రజల్లో అంతగా ప్రాబల్యం లేదు.. ఈ సమయంలో అప్పులు తెచ్చి ఎన్నికల్లో నిలబడటం సాహసమే అవుతుందని భావించిన నేతలు జగన్ నిర్ణయాల మీద అసంతృప్తితో ఉన్నట్టు ఆరోపణలున్నాయి.. పార్టీ అభ్యర్థిని బరిలోకి దిగమని ఆదేశించి, ఆ తర్వాత అతను ఎదుర్కొనే సమస్యలకు తగిన సహాయం అందించలేకపోతే నాయకత్వం ఇచ్చిన పిలుపు ఆచరణలో ఎంతవరకు ఉపయోగపడుతుందనేది ఒక పార్టీ అధినేతగా జగన్ కు తెలియాలని కూడా చర్చించుకున్నట్టు ప్రచారం జరిగింది.
మరోవైపు అధికార టీడీపీ కూటమికి.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 మున్సిపాలిటీల స్థానాలు ఏకగ్రీవం కానున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.. జగన్ ఎంతగా కూటమి విజయాన్ని అడ్డుకోవాలని చూసినప్పటికి ఆయన ఇచ్చిన పిలుపు వల్ల వైసీపీ కొంతవరకైన తన ప్రాబల్యాన్ని చాటుకునే అవకాశాన్ని కోల్పోయినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.. మరోవైపు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యం.. ఆ ప్రభుత్వ పనితీరుపై ప్రభావం చూపించవచ్చు.. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన వైసీపీ.. అలాంటి చర్యలు చేపట్టాక పోగా సొంత పార్టీ నేతలను కట్టడి చేసి విజయాన్ని అందుకోవాలని నిర్ధేశం చేయడం విడ్డూరమని అనుకుంటున్నారు.
స్థానిక ఎన్నికలలో బలపడితే.. అసెంబ్లీ ఎన్నికల వరకు వైసీపీకి మైలేజ్ తీసుకు రావచ్చనే ఆలోచన ఇంకా జగన్ కు ఎందుకు రావడం లేదనే అనుమానాలు కొందరు ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నారు.. ఇక ఏ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించకుండా ఉన్న జగన్ వ్యవహారశైలి పార్టీకి నష్టాన్ని కలిగిస్తుందే తప్ప లాభం ఉండదని ఇప్పటికే కొందరు ఫిక్స్ అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి..
మరోవైపు తండ్రి రాజశేఖర్ దగ్గర ఉన్నంత రాజకీయ చతురత, వ్యూహాత్మకమైన ఆలోచన, అందరినీ కలుపుకునే తత్త్వం జగన్ లో కొరవడినట్టు సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.. ఇక జగన్ రాజకీయ ప్రయాణంలో ఆయన ఎదుర్కొంటున్న సవాళ్లు ఎన్నికల వ్యూహాలకే పరిమితం కాలేదు.. కుటుంబంలో తలెత్తిన విభేదాలు కూడా ఆయన రాజకీయ ప్రతిష్ఠపై ప్రభావం చూపుతున్నాయనే విశ్లేషణలు ఉన్నాయి.
ఒకప్పుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం కాంగ్రెస్ రాజకీయాల్లోనూ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ ఒక బలమైన ప్రతీకగా నిలిచింది. వైఎస్సార్ సంక్షేమ పాలన, కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణ జగన్ రాజకీయ ఎదుగుదలకు కూడా తోడ్పడ్డాయి. అదే సమయంలో జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య విభేదాలు బహిరంగం కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆస్తుల పంపకం, వ్యాపార సంస్థల్లో వాటాల బదిలీ, కుటుంబ సభ్యుల మధ్య నమ్మకం వంటి అంశాలు వివాదానికి కేంద్రంగా మారాయి. షర్మిల తనకు న్యాయంగా రావాల్సిన వాటా దక్కడం లేదని ఆరోపించారు. జగన్ వైపు నుంచి ఆస్తులు, వాటాల విషయంలో భిన్నమైన న్యాయపరమైన వాదనలు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలో 2026 మార్చిలో వైఎస్ విజయమ్మ ఆస్తుల వివాదానికి సంబంధించి కోర్టులో అఫిడవిట్ సమర్పించినట్లు వార్తలు వచ్చాయి. అందులో కుటుంబ ఆస్తులపై, వైఎస్సార్ ఉద్దేశాలపై ఆమె పేర్కొన్న అంశాలు ఈ వివాదానికి మరింత ప్రాధాన్యం తెచ్చాయి.
ముఖ్యంగా షర్మిల-జగన్‌పై బహిరంగంగా విమర్శలు చేయడం వల్ల ఈ వివాదం కుటుంబ వ్యవహారంగా మాత్రమే మిగలకుండా రాజకీయ రంగు పులుముకుంది. ఈ అంశం జగన్‌పై వ్యతిరేకంగా ప్రచారానికి అవకాశం కల్పించింది.. ఈ సమయంలో సోదరితో ఉన్న విభేదాలను న్యాయపరంగా, గౌరవప్రదంగా పరిష్కరించుకునే ప్రయత్నం జగన్ చేయలేదనే ప్రచారం జరిగింది. సొంత కుటుంబంలోనే న్యాయం చేయలేని నాయకుడు ప్రజలకు ఎలా న్యాయం చేస్తాడనే వాదన ప్రజల ముందుకు వచ్చింది..
ఇక జగన్ రాజకీయ ప్రతిష్ఠను ప్రభావితం చేస్తున్న మరో అంశం.. వైఎస్సార్ సోదరుడు, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి 2019 మార్చిలో హత్యకు గురవడం.. ఈ ఘటన అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఆ తర్వాత కేసు దర్యాప్తు, నిందితులపై ఆరోపణలు, బెయిళ్లు, కోర్టు విచారణలు, కుటుంబ సభ్యుల మధ్య పరస్పర విమర్శలు.. ఇవన్నీ ఈ కేసును నిరంతరం చర్చలో ఉంచాయి.
ఈ క్రమంలో ప్రజల్లో ఒక వర్గం ఈ కేసుపై పూర్తి స్థాయి న్యాయపరమైన విచారణను కోరుకుంటోంది. మరికొందరు దీనిని వైసీపీ నాయకత్వంపై రాజకీయ విమర్శలకు ఉపయోగిస్తున్నారు. ప్రత్యర్థులు జగన్ కుటుంబం చుట్టూ ఉన్న వివాదాలను, వివేకా హత్య కేసును రాజకీయంగా బాగా వాడుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. మొత్తంగా చూస్తే జగన్ కు ఈ అంశాలన్నీ అగ్ని పరీక్షగా మారాయని తెలుస్తుంది.
ఇక జగన్ రాజకీయంగా ఎదుర్కొంటున్న సమస్య కేవలం కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కాదు. తన పార్టీ నాయకత్వంపై విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, ప్రజల్లో తనపై ఏర్పడుతున్న ప్రతికూల అభిప్రాయాలను ఎదుర్కొని సానుకూలంగా మలచుకోవడం.. కుటుంబ వివాదాల ప్రభావాన్ని తగ్గించుకోవడం.. వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయపరమైన పరిణామాలను గౌరవిస్తూ ప్రజల్లో స్పష్టతకు అవకాశం కల్పించడం.. ఇవన్నీ ఆయన ముందున్న సవాళ్లుగా విశ్లేషకులు చెబుతున్నారు..
ఇక ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాదు.. పార్టీ విజయానికి కావలసిన కొన్ని మార్గాలను కూడా ఆచరించాలని.. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ.. జనానికి భరోసా కల్పించాలని చెబుతున్నారు.. ఇక మొత్తంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి అధికారం అందని ద్రాక్ష అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నట్టు చర్చించుకుంటున్నారు.. మరి చూడాలి.. జగన్ రాటు తేలుతాడా?.. లేక చతికిలపడుతాడా? అనేది..


