congress: సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ అంటే దూకుడు మామూలుగా ఉండదు. సర్కార్ చేసే చిన్న అభివృద్ధి పనైనా మైకులూది ఊరూవాడా ప్రచారం చేసుకోవాలి. బలం తక్కువగా ఉన్న ప్రాంతాలను వెతికి పట్టుకుని మరీ జెండా పాతాలి. కానీ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రానికే గుండెకాయ లాంటి హైదరాబాద్ మహానగరంలో మాత్రం చేతులెత్తేసినట్లే కనిపిస్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వం ప్రణాళికలతో ముందుకెళ్తుంటే, క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు మాత్రం నత్తనడకన సాగుతూ ఉనికిని కాపాడుకోలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జీహెచ్ఎంసీ మూడు ముక్కలు..
పరిపాలనా వికేంద్రీకరణ, వేగవంతమైన అభివృద్ధి పేరుతో జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన రాష్ట్ర ప్రభుత్వం, త్వరలోనే వీటికి ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియగానే రంగంలోకి దిగాలని పెద్దలు భావిస్తున్నారు. ప్రభుత్వ ఆలోచన ఇంత పకడ్బందీగా ఉంటే.. ఆ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి కార్పొరేషన్లపై పట్టు సాధించాల్సిన స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం ఆ ఉత్సాహమే కనిపించడం లేదు.
పేరుకు మూడు జిల్లాలకు ముగ్గురు డీసీసీ అధ్యక్షులను నియమించినప్పటికీ, ఇప్పటివరకు పూర్తిస్థాయి కమిటీలను కూడా వేసుకోలేకపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధిష్టానం పిలుపునిస్తే ఏదో తూతూమంత్రంగా నాలుగు కార్యక్రమాలు చేయడం తప్ప, క్యాడర్‌ను కదిలించే సరికొత్త యాక్షన్ ప్లాన్ ఏదీ క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. ఇన్ఛార్జ్ కార్యదర్శి సచిన్ సావంత్ గాంధీ భవన్లో రివ్యూలకే పరిమితమవుతున్నారు తప్ప, గ్రౌండ్ లెవెల్ రియాలిటీని పట్టించుకోవడం లేదన్న విమర్శలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి.
ఎంఐఎంతో దోస్తీ.. సొంత పార్టీ నేతలకు ద్రోహమా?
గతంలో హైదరాబాద్‌లో కాంగ్రెస్ అంటే పీజేఆర్, ముఖేష్ గౌడ్ లాంటి మాస్ లీడర్లు ఉండేవారు. ఆ తర్వాత దానం నాగేందర్ హవా నడిచింది. కానీ ఇప్పుడు నగరంలో పార్టీని నడిపించే అంతటి బలమైన నాయకత్వం కరువైందన్నది స్పష్టమవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాల్లో ప్రభంజనం సృష్టించినా, హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ చతికిలపడింది. అలాంటి చోట మరింత పట్టు పెంచుకోవాల్సింది పోయి, గాలికి వదిలేయడంపై కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. దీనికితోడు ఎంఐఎంతో సాగుతున్న లోపాయికారీ దోస్తీ కూడా పార్టీకి శాపంగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సిటీలో మంత్రులు తమ సొంత పార్టీ నేతలను పట్టించుకోకుండా, ఎంఐఎం నేతలకే ప్రాధాన్యత ఇస్తుండటంతో స్థానిక కాంగ్రెస్ లీడర్లు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.
ప్రభుత్వ పథకాలను బస్తీల్లోని పేదలకు చేరవేస్తూ, కమిటీలు వేసి కార్యకర్తలను యాక్టివ్ చేయకపోతే.. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గ్రేటర్లో కాంగ్రెస్ మరోసారి చేదు ఫలితాలను చవిచూడాల్సి వస్తుందని పార్టీలోని సీనియర్లే బాహాటంగా హెచ్చరిస్తున్నారు.


