ఏపీ

YS jagan comments on CBN: ‘నీడను చూసినా భయపడే స్థాయికి చంద్రబాబు..’ టీచర్ల సస్పెన్షన్‌పై జగన్ ఫైర్!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

సొంత నీడను చూసినా భయపడే స్థాయికి సీఎం చంద్రబాబు దిగజారారని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిబంధనల నుంచి మినహాయింపు కోరుతూ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను కలిసిన ఐదుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సొంత నీడను చూసినా భయపడే స్థాయికి సీఎం చంద్రబాబు దిగజారారని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిబంధనల నుంచి మినహాయింపు కోరుతూ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను కలిసిన ఐదుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు.

సర్వీసులో చేరినప్పుడు లేని నిబంధనల వల్ల లక్ష మందికి పైగా సీనియర్ టీచర్లు ఇబ్బందులు పడుతుంటే, వారి సమస్యలపై వినతిపత్రం ఇవ్వడం ఏరకంగా నేరమవుతుందని జగన్ సూటిగా ప్రశ్నించారు. వెంటనే సస్పెన్షన్లు ఎత్తివేసి, బాధిత ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు.. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి టెట్ మినహాయింపు సాధించాల్సింది పోయి, సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన టీచర్లను సస్పెండ్ చేయడం దారుణమన్నారు.

వైకాపా ఎంపీల సహకారంతో తమ ఆవేదనను తెలిపేందుకు రాజకీయ రంగు పులిమి వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ అన్యాయమైన చర్యలపై జరిగే న్యాయపోరాటంలో ఉపాధ్యాయులకు వైసీపీ పూర్తి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న నియంతృత్వ ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని జగన్ విమర్శించారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ చంద్రబాబు గాలికొదిలేశారని ధ్వజమెత్తారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్నా ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్), పీఆర్సీ అమలు చేయలేదని, ఐదు డీఏలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తుచేశారు. సమస్యలను పరిష్కరించడం చేతకాక, ప్రశ్నించే వారిపై సస్పెన్షన్ల వేటు వేయడం పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. అధికార అహంకారంతో ఉపాధ్యాయులపై 'రెడ్ బుక్' అరాచక పాలన సాగిస్తున్నారని జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉపాధ్యాయుల పట్ల ఇలాంటి వేధింపులు కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

#YS Jagan Mohan Reddy#Chandrababu Naidu#Teachers Suspension AP#TET Exemption AP#YSRCP Support Teachers#AP Politics 2026#Red Book Governance AP#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి