రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ ఏదో ఒక సమస్య వారిని వేధిస్తున్నది. ఫుడ్ పాయిజన్ ఘటనలు మరువక ముందే తాజాగా తోటి సీనియర్ విద్యార్థులు జూనియర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని కొందరు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోవాల్సిన వార్డెన్, ఉపాధ్యాయులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.
ఇటీవలి కాలంలో గురుకుల పాఠశాలల్లో వరుస ర్యాగింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. అదనపు చపాతీ అడిగాడని 8వ తరగతి విద్యార్థికి సీనియర్లు పెనంతో వాతలు పెట్టారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని బాలుర సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఈ ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. భోజనం సమయంలో అదనపు చపాతీ కావాలని అడిగిన ఎనిమిదో తరగతి విద్యార్థి సాయిబాలాజీకి
తొమ్మిదో తరగతి విద్యార్థులు పెనంతో వాతలు పెట్టినట్టు సమాచారం.విషయం తెలుసుకున్న పలువురు విద్యార్థుల పేరెంట్స్ పోలీసులను తీసుకుని పాఠశాలకు చేరుకున్నట్టు తెలిసింది. ఎంతసేపు అడిగినా తల్లిదండ్రులను, పోలీసులను సిబ్బంది హాస్టల్‌లోపలికి అనుమతించలేదని సమాచారం.అయితే, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు.
https://x.com/TeluguScribe/status/2089222475423089053?s=20
కాగా, మరోవైపు బాధిత విద్యార్థి సాయిబాలాజీ తరచూ అందరితో గొడవలు పెట్టుకుంటాడని, గొడవలు పెట్టుకోనని గతంలో లిఖితపూర్వకంగా రాసి ఇచ్చాడని ప్రిన్సిపల్ వెల్లడించారు. దీంతో హాస్టల్ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగినట్టు సమాచారం. సరైన అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, ర్యాగింగ్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని బాధిత పేరెంట్స్, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.


