రాష్ట్రంలో మరో సంచలనం చోటుచేసుకుంది. ఓ డీఐజీ అధికారిపై సీఐడీ విచారణకు రాష్ట్ర డీజేపీ సీవీ ఆనంద్ ఆదేశించినట్టు సమాచారం.సదరు అధికారి.. అధికార దుర్వినియోగంతో పాటు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.అతని ఆస్తులకు సంబంధించి వరుస ఫిర్యాదులు అందడంతో సీఐడీ విచారణకు ఉన్నతాధికారుల ఆదేశించినట్టు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు పెద్దఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తుండగా. .ఆ శాఖ, ఈ శాఖ అని తేడా లేకుండా మంచి హోదాలో ఉన్న అధికారులు ఇటీవల ఏసీబీ అధికారులకు దొరికిన విషయం తెలిసిందే. ఒక్కో అధికారి అక్రమార్జన రూ.వందల కోట్లలో ఉంటుందని అనిశా అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదిలాఉండగా, తెలంగాణలో ప్రస్తుతమున్న 11 మంది డీఐజీలలో కేంద్ర సర్వీసులో ఉన్న ఇద్దరిని మినహాయిస్తే, మిగతా 9 మందిలో ఒకరైన డీఐజీ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందినట్టు సమాచారం. సదరు డీఐజీ దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాలో 20 ఎకరాలు కొనుగోలు చేశాడని, ప్రస్తుతం నిర్మిస్తున్న ఇంటి కోసం పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నాడని ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు.
పదోన్నతులు, బదిలీల అంశంలో డీసీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు ప్రతి ఒక్కరీ దగ్గర సదరు డీఐజీ డబ్బు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. తన పరిధిలో పనిచేస్తున్న ఓ ఎస్‌ఐను అడ్డం పెట్టుకుని ఈ అక్రమాలకు పాల్పడుతున్నాడని సమాచారం.ఏకంగా డీఐజీ స్థాయి అధికారిపై సీఐడీ విచారణ జరగడం, విచారణలో బయటపడే అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశాలపై ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ శాఖలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.


