సులువుగా డబ్బులు సంపాదించేందుకు కొందరు మహిళలు అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా సిద్ధిపేటలో ఇద్దరు మహిళలు ఈజీ మనీ కోసం ఏకంగా దారుణాలకు పాల్పడ్డారు. ఓ మహిళల తన భర్త బీమా డబ్బుల కోసం అతన్ని హతమారిస్తే... మరో మహిళ ఏకంగా తన మైనర్ కొడుకు సాయంతో ఒంటరి మహిళలను టార్గెట్ చేసి హతమార్చడం చేసింది. ఈ ఘటనలు ఒక్కసారిగా సిద్ధిపేట ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి.ఈ రెండు ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారాయి.
వివరాల్లోకివెళితే..సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం భూంపల్లిలో తన మైనర్ కొడుకుతో కలిసి నివాసముండే రజిత.. బతుకుదెరువు కోసం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద టీ దుకాణం నడిపిస్తోంది. టీ తాగడానికి వచ్చే వారి మాటలు వినే అలవాటు ఉన్న రజిత.. శత్రువులపై అనుమానం కలిగేలా ఊరిలో గొడవలున్న ఒంటరి మహిళలనే టార్గెట్ చేసేది. అలా వారిని నమ్మించి హత్య చేసిన అనంతరం ‘బంగారం’ అపహరించి, అడవిలో మృతదేహాలను దహనం చేసిది. హత్యల కోసం తన మైనర్ కొడుకు సాయం తీసుకునేది.
ఇలా తన కొడుకు సాయంతో ఇద్దరు మహిళలను గొంతు నులిమి చంపిన రజిత..వారిని పెట్రోల్ పోసి తగులబెట్టినట్టు తెలిసింది. విజయ అనే మహిళలను చంపి మృతదేహాన్ని అచ్చాయిపల్లి అడవిలో కాల్చేందుకు తీసుకెళ్తుండగా.. భారీ వర్షం పడటంతో మార్గమధ్యలోని రామక్కపేట వద్ద రోడ్డు పక్కనే పెట్రోల్ పోసి నిప్పు పెట్టి పారిపోయారు. విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితులను పట్టుకున్నారు.
డబ్బుల కోసం ప్లాన్ చేసి మరీ..
అనారోగ్యంతో ఉన్న భర్తకు ఇన్సూరెన్స్ చేయించిన ఓ మహిళ.. అతన్ని చంపి రిటైర్మెంట్, బీమా డబ్బులు కొట్టేయాలని కుట్ర చేసింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో జరిగింది. ఆసిఫాబాద్‌లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా వెంకటేశం పనిచేస్తున్నాడు. అతని భార్య రాజమణి ఏఎన్‌ఎంగా విధులు నిర్వర్తిస్తోంది. ఈ నెలలో వెంకటేశం పదవీ విరమణ చేయాల్సి ఉండగా, రిటైర్మెంట్, బీమా డబ్బులు, ఆస్తి విషయంలో ఇద్దరూ గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే స్థానిక హనుమాన్ నగర్‌లో భర్త వెంకటేశంను రోకలిబండతో కొట్టి భార్య రాజమణి హత్య చేసింది.
అనంతరం నేచురల్ డెత్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపి నిందితురాలిని అరెస్టు చేశారు.


