ఏపీలో బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న బాలికను ఓ యువతి, యువకుడు ఎత్తుకెళ్లినట్టు సమాచారం. రాష్ట్రంలో వరుసగా క్రైమ్ ఘటనలు జరుగుతుండటం అక్కడి పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన విశాఖపట్నం రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
వివరాల్లోకివెళితే.. విజయవాడకు చెందిన సయ్యద్ అబ్దుల్ హఫీజ్ గని, సయ్యద్ శేషమ్మ భార్యాభర్తలు..వీరు దుకాణల్లో ధూపం వేస్తూ జీవనం సాగిస్తున్నారు. మూడు రోజుల క్రితం విజయవాడ నుంచి విశాఖ వచ్చి రైల్వే స్టేషన్‌కు వచ్చారు. అక్కడే ఎదురుగా ఉన్న బస్టాప్‌లో రాత్రిపూట వారి అమ్మాయి(4)తో కలిసి ఫుట్‌పాత్‌పై నిద్రించారు.
అయితే, అదే సమయంలో ఫుట్‌పాత్‌పై తల్లిదండ్రులతో నిద్రిస్తున్న బాలికను ఓ యువతీ,యువకుడు కిడ్నాప్ చేసినట్టు తెలిసింది.ఈ విషయం తెలియని బాధిత పేరెంట్స్ లేచి చూసేసరికి తమ కూతురు లేకపోవడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైనట్టు సమాచారం.వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గర్తించారు.
https://x.com/TeluguScribe/status/2093212297946923339?s=20
ఎస్.రాయవరానికి చెందిన ప్రతిభ, గరివిడికి చెందిన ఉపేంద్ర అనే ఇద్దరు స్కూటీ (AP39 CL 1728)పై వచ్చి అమ్మాయిని గాజువాక వైపు తీసుకెళ్తున్నట్టు గుర్తించారు.స్కూటీ నంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నట్టు సమాచారం. నిందితుల ఫోన్ నెంబర్లు సైతం సేకరించి వారిని ట్రాక్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.












