కూటమికి జనసేన టెన్షన్
లోకల్ ఎన్నికల ముంగిట పవన్ ప్లాన్ ఏంటి..?
ఇవాళ జనసేన కీలక సమావేశం
21 సీట్ల ఫార్ములాకు జనసేన.. నో!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సమాయత్తమవుతున్న వేళ.. మంగళగిరిలో పార్టీ కీలక సమావేశం జరగబోతోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, గతంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన నేతలు ఈ భేటీకి హాజరుకానున్నారు. స్థానిక ఎన్నికల వ్యూహం, పార్టీ బలోపేతం, సీట్ల సర్దుబాటు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.
21 సీట్ల ఫార్ములాకు పవన్ గుడ్‌బై?
ఈ సమావేశానికి ఇంత ప్రాధాన్యం రావడానికి ప్రధాన కారణం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం కోసం జనసేన కేవలం 21 స్థానాల్లో పోటీ చేసింది. అయితే ఆ 21 సీట్ల ఫార్ములా కేవలం అసెంబ్లీ ఎన్నికల వ్యూహమేనని పవన్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అదే ఫార్ములా వర్తించదని.. ప్రాంతీయ, సామాజిక, రాజకీయ బలాబలాలను బట్టి సీట్లను నిర్ణయిస్తామని చెప్పారు.
అంటే.. స్థానిక ఎన్నికల్లో జనసేన ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటోంది. అదే ఇప్పుడు టీడీపీ–జనసేన కూటమిలో అసలు చర్చగా మారింది.
పవన్ టార్గెట్ ఏంటి?
స్థానిక ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల కంటే పూర్తిగా భిన్నం. గ్రామ పంచాయతీ నుంచి మండలం, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్ వరకు ప్రతి స్థాయిలో పార్టీ కేడర్‌కు అవకాశం ఉంటుంది. అందుకే జనసేనలోని కింది స్థాయి నేతలు, కార్యకర్తలు కూడా తమకు పోటీ చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నారు.
2024లో జనసేనకు వచ్చిన ఘన విజయం పార్టీ కేడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇప్పుడు ఆ బలాన్ని స్థానిక సంస్థల్లో కూడా చూపించాలని జనసేన భావిస్తోంది. అందుకే పార్టీకి క్షేత్రస్థాయిలో ఎక్కడ బలం ఉంది? ఏ ప్రాంతాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఎక్కడ సీట్లు అడగాలి? అనే అంశాలపై ఇవాళ్టి సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.
టీడీపీతో అసలు పంచాయితీ ఇక్కడే!
ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. జనసేన ఎక్కువ సీట్లు కోరుకుంటే.. టీడీపీ కూడా తమ కేడర్‌ను పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉంటుందా? స్థానిక ఎన్నికల్లో ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు.
ఒక నియోజకవర్గంలో అసెంబ్లీ టికెట్ ఒక్కటే ఉంటుంది. కానీ స్థానిక ఎన్నికల్లో వందలాది స్థానాలు ఉంటాయి. అందుకే ఇక్కడ సీట్ల పంపకం మరింత సున్నితమైన వ్యవహారం. పైస్థాయిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒక ఫార్ములాకు అంగీకరించినా.. కిందిస్థాయిలో రెండు పార్టీల కేడర్ దాన్ని ఎంతవరకు అంగీకరిస్తుందన్నదే కీలకం.
ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో టీడీపీ–జనసేన మధ్య సీట్ల సర్దుబాటు అంత సులభం కాదనే చర్చ జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో రెండు పార్టీల కేడర్ మధ్య పోటీ వాతావరణం కూడా కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది.
జనసేనకు ఇది ఎందుకు కీలకం?
జనసేనకు ఇది కేవలం స్థానిక ఎన్నికల పోరు కాదు. పార్టీని క్షేత్రస్థాయిలో విస్తరించుకునే అవకాశం. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది. ఇప్పుడు గ్రామస్థాయి వరకు సంస్థాగతంగా బలం పెంచుకుంటే.. 2029 నాటికి జనసేన రాజకీయ శక్తి మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
అందుకే పవన్ కల్యాణ్ స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకే పరిమితం కాకుండా ప్రాంతాల వారీగా జనసేన బలాన్ని అంచనా వేయాలని కూడా సూచించారు.
ఇవాళ్టి మీటింగ్ ఏం తేల్చబోతోంది?
ఇవాళ్టి సమావేశంలో తుది సీట్ల పంపకం జరిగిపోతుందా అంటే.. ఇప్పుడే చెప్పలేం. కానీ జనసేన అసలు ఎంత వాటా కోరుకుంటోంది? ఏ ప్రాంతాల్లో బలంగా ఉందని భావిస్తోంది? టీడీపీతో సర్దుబాటులో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది? అనే దానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ సమావేశానికి పవన్ కల్యాణ్ వస్తారో రారో తెలియదు. ఆయన సూచనలు, ఆదేశాలను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేతలకు వివరించే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ కూడా ఇదే రోజు సమావేశం కానుంది.
కూటమికి తొలి లోకల్ టెస్ట్!
అసలు ఈ ఎన్నికలు టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి కూడా కీలకమే. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన కూటమి.. ఇప్పుడు గ్రామస్థాయి వరకు అదే ఐక్యతను కొనసాగించగలదా అన్నది తేలాల్సి ఉంది.
ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో పార్టీ సిద్ధాంతాల కంటే వ్యక్తిగత పరిచయాలు, స్థానిక బలం, సామాజిక సమీకరణాలు, కేడర్ ప్రభావం ఎక్కువగా పనిచేస్తాయి. అందుకే ఇక్కడ సీట్ల పంపకం ఒక్క సీటు విషయం కాదు.. కూటమిలోని మూడు పార్టీల మధ్య భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు కూడా సంకేతం.
ఇవాళ జనసేన భేటీతో ఈ లెక్కలకు తొలి రూపం రావచ్చు. 21 సీట్లతో అసెంబ్లీలో సంచలనం సృష్టించిన జనసేన.. ఇప్పుడు స్థానిక పోరులో తన అసలు బలమెంతో చూపించాలనుకుంటోంది.
మరి పవన్ కోరుతున్న ఆ ‘పెద్ద వాటా’కు టీడీపీ ఎంతవరకు ఓకే చెబుతుంది? జనసేనకు ఎక్కువ సీట్లు ఇస్తే టీడీపీ కేడర్‌ను ఎలా సర్దుబాటు చేస్తారు? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన ప్రశ్న.
ఇవాళ్టి జనసేన సమావేశం.. స్థానిక ఎన్నికల వ్యూహానికి మాత్రమే కాదు.. కూటమిలో పవన్ కల్యాణ్ రాజకీయ బేరసారాల బలానికి కూడా ఒక సంకేతం కాబోతోంది.












