Yadadri: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్‌లో మరో కీలక ఘట్టం నమోదైంది. 5వ యూనిట్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ట్రయల్ రన్ ప్రక్రియలో భాగంగా 5వ యూనిట్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని విజయవంతంగా ప్రారంభించి గ్రిడ్‌కు అనుసంధానించే దిశగా కీలక పురోగతి సాధించారు. 5వ యూనిట్ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ప్లాంట్ పూర్తిస్థాయి లక్ష్యం 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి మార్గం సుగమమైంది. మొత్తం 4వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్‌లో ఇప్పటికే నాలుగు యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా 5వ యూనిట్ ట్రయల్ రన్‌ను జెన్కో అధికారులు పూర్తి చేశారు. వచ్చే నెల నాటికి 5 యూనిట్లలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టారు.
4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపల్లిలో రూ.29వేల కోట్ల వ్యయంతో 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. 2017లో 29వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొదలైన ఈ భారీ విద్యుత్ కేంద్రం పనులు ఆలస్యం కావడంతో ప్రాజెక్టు వ్యయం రూ.37వేల కోట్లను దాటింది.
ఇక నిరంతర విద్యుత్ సరఫరా..
బొగ్గు సరఫరా వ్యవస్థ, సీహెచ్‌పీ, ఏహెచ్‌పీ నిర్మాణాల్లో నాణ్యత లోపించినట్లు విచారణలో ఉన్నతాధికారులు గుర్తించారు. ప్రస్తుతం 800 మెగావాట్ల చొప్పున నాలుగు యూనిట్లలో 3,200 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఐదో యూనిట్ పనుల్లో జాప్యం వల్ల అది ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పుడు దాని ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఐదో యూనిట్లో ఉత్పత్తికి అధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న వ్యవసాయ, పారిశ్రామిక, గృహ అవసరాలకు అనుగుణంగా నిరంతర విద్యుత్ సరఫరా అందించడంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అత్యంత కీలక పాత్ర పోషించనుంది.
తెలంగాణ విద్యుత్ రంగంలో మరో మైలురాయి
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 5వ యూనిట్ పవర్ గ్రిడ్‌తో విజయవంతంగా అనుసంధానం కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ విద్యుత్ రంగంలో మరో చరిత్రాత్మక మైలురాయి నమోదైందన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి విద్యుత్ కొరతను అధిగమించి మిగులు సాధించే దిశగా తీసుకున్న చర్యలు నేడు ఫలితాలను ఇస్తున్నాయని చెప్పుకొచ్చారు. యాదాద్రి ప్లాంట్ విజయం తమకు ఎంతో గర్వకారణమన్నారు.
కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం
''మాజీ సీఎం కేసీఆర్ దార్శనికత, దూర దృష్టికి యాదాద్రి పవర్ ప్లాంట్ రూపురేఖలే నిలువెత్తు సాక్ష్యం. తెలంగాణ విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్.. రాష్ట్ర పారిశ్రామిక, వ్యవసాయ, గృహ అవసరాలకు నిరంతర విద్యుత్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కేసీఆర్ నాయకత్వంలో రూపుదిద్దుకున్న ప్రణాళికలు, విద్యుత్ అధికారుల నిరంతర కృషి వల్లే ఈ భారీ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తై గ్రిడ్‌కు అనుసంధానమైంది'' అని కేటీఆర్ తెలిపారు.


