ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్ర విభజన తర్వాత అధ్వానంగా తయారైన విషయం తెలిసిందే.. ఒకగానొక సమయంలో పార్టీ ఉనికిని కాపాడుకోలేని పరిస్థితికి చేరుకుంది. మరోవైపు కేంద్రంలో బీజేపీ ధాటికి ఎదురవుతున్న వరుస పరాజయాలు.. తెలంగాణలో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం.. హస్తాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి.. ఇది చాలదన్నట్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత అంతటి వాగ్దాటి, పోరాట పటిమ ఉన్న నాయకత్వం పార్టీకి కరువైందనే ఆరోపణలున్నాయి.
దాంతో కాంగ్రెస్ భవిష్యత్తుపై ఆ పార్టీ శ్రేణుల్లో ఆశలు సన్నగిల్లిన పరిస్థితి నెలకొంది. అలాంటి సమయంలో తెలంగాణ కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి రూపంలో ఒక వేపన్ దొరికింది. అప్పటికే రాష్ట్రంలో తిరుగులేని ఆధిక్యతతో పాలన చేస్తున్న బీఆర్ఎస్ ను ఢీ కొట్టడానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.. ఇక దొరలు కూడా టీడీపీ, కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకుని.. తమకు రాష్ట్రంలో ఎదురు లేదని.. ఇక తెలంగాణ అంటే కేసీఆర్ మాత్రమే అనే లేవల్లో దొరలు ఉన్నారు..
కేటీఆర్ అయితే భవిష్యత్తు ముఖ్యమంత్రి తానే అనే భ్రమలో గాల్లో అప్పటికే లెక్కపెట్టలేనన్ని మేడలు కట్టాడు.. ఈ పునాదులను కదిలించాలంటే అందరికీ సాధ్యం అయ్యే పనికాదని కాంగ్రెస్ నేతలకు తెలుసు.. అలాంటి సమయంలో రేవంత్ సుడిగాలిలా వచ్చి తుఫానులా మారి బీఆర్ఎస్ కు ఊపిరి ఆడకుండా చేశాడు.. అయితే ఆయన రాజకీయ ఎదుగుదల కాంగ్రెస్ లో అంతా సులువుగా జరగలేదు. ఎందరో ఉద్దండులు, తలలు పండిన వారు పదవుల కోసం అర్రులు చాచుతున్న సమయం..
అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 2017 అక్టోబరు 31న ఢిల్లీలో అప్పటి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకు ముందు
తెలుగుదేశం పార్టీ (TDP) తెలంగాణ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు లేదని భావించిన రేవంత్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టు ప్రచారం జరిగింది. ఇక పార్టీలో చేరిన కొద్ది రోజులకే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను స్వీకరించారు.
తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి ఓడిపోయినప్పటికీ ఆయన ఎక్కడ వెనకడుగు వేయలేదు.. ఎదురవుతున్న విమర్శలను లెక్క చేయక 2019 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అతిపెద్ద నియోజకవర్గాలలో ఒకటైన మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీలో ఆయన పట్టు మరింత బలపడేలా చేసింది.
దీంతో కాంగ్రెస్ అధిష్టానం పార్టీలో రేవంత్ రెడ్డి దూకుడు, ప్రజల్లో ఆయనకున్న చరిష్మాను గమనించి 2021 జూన్ 26న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడిగా నియమించి, జూలై 7న ఆయనకు బాధ్యతలు అప్పగించింది.. నాటి నుంచి అధికార పార్టీ BRS పై నిరంతర పోరాటాలు, పాదయాత్రలతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతానికి కార్యకర్తలతో పాటు రేవంతుడు చేసిన కృషి అందరికీ తెలిసిందే..
అలా అధిష్టానం దృష్టిలో హీరో అయిన తర్వాత మరింత దూకుడు పెంచి బీఆర్ఎస్ పాలనను సవాల్ చేస్తూ.. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. రేవంత్ రెడ్డి స్వయంగా కొడంగల్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి, 2023 డిసెంబరు 7న తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఒక సాధారణ కార్యకర్తగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో అడుగుపెట్టి, కేవలం ఆరేళ్ల వ్యవధిలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే స్థాయికి ఎదగడం రాజకీయాల్లో ఒక అరుదైన మైలురాయిగా నిలిచిపోయింది. అలా ఆ విజయానికి కొనసాగింపుగా 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ తెలంగాణలో కాంగ్రెస్ తన బలాన్ని చాటుకుంది.. అలా రాజకీయంగా దిక్కుతోచని స్థితిలో ఉన్న కాంగ్రెస్‌కు రేవంత్ రెడ్డి కొత్త దారి చూపించి పార్టీకి పునరుజ్జీవం అందించారు..
మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత.. తెలంగాణలో ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎవరు ఊహించలేదు. పదేళ్లపాటు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బీఆర్ఎస్‌ను ఓడించి.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాజకీయ పరిశీలకులు కూడా అంచనా వేయలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే నాయకులు ఎక్కువే.. వర్గపోరు ఎక్కువే.. కానీ గెలుపు అవకాశాలు తక్కువ అనే అపవాదు మూట గట్టుకుంది.
అలాంటి పరిస్థితిలో పార్టీకి తిరిగి అధికారాన్ని అందించిన నాయకుడు రేవంత్ రెడ్డి. అందుకే 2023-2024ను కాంగ్రెస్ చరిత్రలో మైలురాయిగా.. రేవంత్‌ను కాంగ్రెస్‌కు పునరుజ్జీవం అందించిన హనుమంతుడిగా అభివర్ణిస్తున్నారు.. రామాయణంలో హనుమంతుడు కేవలం బలశాలి మాత్రమే కాదు. సమస్యను అర్థం చేసుకుని, దానికి పరిష్కారం కనుగొని, తన లక్ష్యాన్ని సాధించే వరకు వెనుకడుగు వేయని ధీశాలి..
దీనిని రాజకీయ కోణంలో చూస్తే.. బలహీనపడిన కాంగ్రెస్‌కు తిరిగి గెలుపు సాధ్యమనే నమ్మకాన్ని కల్పించడం, బీఆర్ఎస్ ఆధిపత్యాన్ని సవాల్ చేయడం, పార్టీని అధికారంలోకి తీసుకురావడం వంటి పరిణామాల్లో రేవంత్ పాత్రను ఆ పోలికతో చెబుతున్నారు.. అదీగాక రాముడి కార్యసాధనలో హనుమంతుడి పాత్ర ఎంత ముఖ్యమో.. రాజకీయంగా వెనుకబడిన కాంగ్రెస్‌కు తెలంగాణలో కొత్త ఊపిరి అందించడంలో రేవంత్ నాయకత్వం అంతటి ప్రాధాన్యం సాధించిందనే వాదనకు ఈ విజయాలు బలం చేకూరుస్తున్నాయి.
మరోవైపు కాంగ్రెస్ కు తెలంగాణాలో అంత సులువుగా విజయం దక్కలేదు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ రాజకీయాలకు బలమైన పునాది ఉండేది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీకి విస్తృతమైన నాయకత్వం, కార్యకర్తల బలం ఉండేవి. కానీ తెలంగాణ ఉద్యమం రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేసింది. అదేసమయంలో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంతో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది..
తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ సహకరించినప్పటికి.. ఆ పార్టీకి పొలిటికల్ మైలేజ్ తీసుకురాలేక పోయింది. చివరికి తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రచారం చేసుకున్నా.. రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోలేక పోయింది. ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో రాష్ట్ర సాధన క్రెడిట్‌ను తన రాజకీయ బలంగా మలుచుకోవడంలో కేసీఆర్ విజయం సాధించారు.
మరోవైపు రాష్ట్రంలో తర్వాత కేసీఆర్ పాలనపై విమర్శలు పెరుగుతున్నప్పటికీ.. వాటిని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందనే విమర్శలు ఉన్నాయి.. కేసీఆర్ నియంతృత్వ పోకడను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే విషయంలో పార్టీ తడబడిందనే ఆరోపణలున్నాయి.. అదేవిధంగా జాతీయ రాజకీయాల్లోనూ కాంగ్రెస్‌కు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. కేంద్రంలో బీజేపీ తన ఆధిపత్యాన్ని పెంచుకుంటూ విజయాలతో దూసుకుపోతుంది.
దీంతో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంపై ప్రశ్నలు పెరిగాయి. పార్టీ పునాదులను బలోపేతం చేయాల్సిన సమయంలోనే అంతర్గత విభేదాలు, నాయకుల మధ్య ఆధిపత్య పోరు పార్టీని మరింత బలహీనపరిచాయి.. తెలంగాణలోనూ అదే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారాన్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరడం పార్టీకి కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది.
ఈ దెబ్బకు అసెంబ్లీలో సంఖ్యాబలం తగ్గింది. కార్యకర్తల్లో నిరాశ పెరిగింది. నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లింది. చివరికి ఘనమైన చరిత్ర ఉన్న పార్టీ.. తన ఉనికిని కాపాడుకోవాల్సిన స్థితికి చేరుకుంది. ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం మొదలైంది. తన ఓటు బ్యాంకును విస్తరించుకోవడానికి బీజేపీ, అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు దగ్గర అవడం మొదలుపెట్టిందనే ప్రచారం నాడు జోరందుకుంది.
సరిగ్గా ఇదేసమయంలో రేవంత్ కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇవ్వనడం.. తెలంగాణ రాజకీయాల్లో తనదైన దూకుడుతో, ప్రత్యర్థులపై మాటలతో నేరుగా దాడి చేసే శైలి, సభల్లోనూ ప్రజల్లోనూ తన వాదనను బలంగా వినిపించే పద్ధతితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ కాంగ్రెస్‌లోకి వచ్చినంత మాత్రాన ఆయనకు రాజకీయంగా ఘనమైన స్వాగతం కానీ, సులభమైన మార్గం కానీ లభించలేదు.
పార్టీలో అప్పటికే ఉన్న సీనియర్ నాయకులు తమకంటూ ప్రత్యేక వర్గాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు.. ఎవరి రాజకీయ ప్రాధాన్యం వారిది. ఇలాంటి పరిస్థితిలో కొత్త నాయకుడిగా ఎదగడం అంత సులభం కాదు. కానీ ఎక్కడ తడబడని రేవంత్ తన రాజకీయ వ్యూహాన్ని స్పష్టంగా రూపొందించుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. బీఆర్ఎస్ పాలనపై విమర్శలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉన్న నిరుత్సాహాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు.
ప్రత్యర్థి పార్టీ బలంగా ఉన్నప్పుడు దానిని ఎదుర్కోవాలంటే కేవలం విమర్శలు సరిపోవని గుర్తించి.. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని రగిలించాడు. పార్టీ గెలుపుపై కార్యకర్తలకు నమ్మకం కల్పించారు.. వీటికి తోడు 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత, అధికార మార్పు కోసం ప్రజల్లో కనిపించిన ఆకాంక్ష, కాంగ్రెస్ నాయకత్వం చేసిన ప్రచారం.. ఇవన్నీ రేవంత్ కు కలిసి వచ్చాయి..
మొత్తానికి 2023 డిసెంబర్ 3న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 64 స్థానాలు గెలుచుకుంది. మిత్రపక్షమైన సీపీఐ ఒక స్థానాన్ని గెలుచుకోవడంతో కాంగ్రెస్ కూటమి బలం 65కు చేరింది. బీఆర్ఎస్ 39 స్థానాలకే పరిమితమైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రేవంతున్ని సీఎం చేసింది. అదే జోష్ లో 2024 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఎనిమిది స్థానాలు గెలుచుకుంది. బీజేపీ కూడా ఎనిమిది స్థానాలు సాధించింది. ఎంఐఎం ఒక స్థానాన్ని గెలుచుకుంది. బీఆర్ఎస్ ఒక్క లోక్‌సభ స్థానాన్ని కూడా సాధించలేకపోయింది.
మరోవైపు కాంగ్రెస్ గతంలో అధికారాన్ని కోల్పోయినప్పుడు.. పార్టీ తిరిగి పుంజుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు రేవంత్ నాయకత్వంలో అధికారాన్ని సాధించినందున.. ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం కాంగ్రెస్ బాధ్యత. లేకపోతే గతంలో ఎదురైన రాజకీయ పరిస్థితులు మరోసారి పునరావృతమయ్యే ప్రమాదం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు..


