MVSR College: నాదర్‌గుల్‌లోని MVSR ఇంజినీరింగ్ కాలేజీ ఘటనకు సంబంధించి పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈవెంట్ ఆర్గనైజర్స్ సాకేత్, పునీత్, విశాల్ ను అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. వీరిలో ఇద్దరు ఈవెంట్ ఆర్గనైజర్స్ కాగా మరో ఇద్దరు కాలేజీ మేనేజ్ మెంట్ కి చెందిన వ్యక్తులు. ఎటువంటి సపోర్ట్ లేకుండా లైటింగ్ పోల్ ను పెట్టడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి ఎంవీఎస్ఆర్ మేనేజ్ మెంట్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.
దాండియా వేడుకల్లో ఘోరం
హైదరాబాద్ నగర శివార్లలోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో దసరా పండుగ సందర్భంగా దాండియా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రమాదం చోటుచేసుకుంది. భారీ లైటింగ్ సిస్టమ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. 22మంది గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఆదిభట్ల పోలీసులు దర్యాఫ్తు జరుపుతున్నారు.
ఒక్కసారి కుప్పకూలిన భారీ లైటింగ్ పోల్
దసరా పండుగను పురస్కరించుకుని కాలేజీ క్యాంపస్ లో దాండియా వేడుకలు నిర్వహించింది కాలేజీ యాజమాన్యం. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చారు. విద్యార్థులు గుంపులుగా చేరి దాండియా ఆడుతున్నారు. ఆ సమయంలో ఊహించని ఘోరం జరిగింది. భారీ లైటింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది.
కాలేజీ మేనేజ్‌మెంట్‌కి నోటీసులు
ఈ ఘటనలో కాలేజ్ మేనేజ్‌మెంట్‌కి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. మేనేజ్‌మెంట్‌కి చెందిన ఇద్దరు వ్యక్తులు దాండియా ఈవెంట్‌కు కో-ఆర్డినేటర్లుగా వ్యవహరించారు. అరేంజ్‌మెంట్స్ సరిగా లేవని, లోపాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఇంజినీరింగ్ ఫస్టియర్ విద్యార్థి మృతి చెందారు. గాయపడ్డ వారికి కామినేని, యశోద ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


