మహిళల హాకీ ప్రపంచ కప్‌లో అర్జెంటీనా అద్భుత ప్రదర్శనతో సంచలనం సృష్టించింది. గత నాలుగు ఎడిషన్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వరుసగా ప్రపంచ కప్ టైటిళ్లను ముద్దాడిన నెదర్లాండ్స్ జైత్రయాత్రకు ఫైనల్లో బ్రేక్ వేసింది. శనివారం రాత్రి ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు 1-1 స్కోరుతో సమంగా నిలిచాయి.
దాంతో విజేతను నిర్ణయించడానికి నిర్వహించిన పెనాల్టీ షూటౌట్‌లో డచ్ జట్టుపై 3-1తేడాతో అర్జెంటీనా ఘన విజయాన్ని సాధించి, ముచ్చటగా మూడోసారి విశ్వవిజేతగా కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఈ గెలుపుతో 2022ప్రపంచ కప్ ఫైనల్‌తో పాటు టోక్యో ఒలింపిక్స్ ఫైనల్‌లో నెదర్లాండ్స్ చేతిలో ఎదురైన ఘోర పరాజయాలకు అర్జెంటీనా ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. మ్యాచ్ ప్రారంభంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగగా, రెండో క్వార్టర్ ఆఖరు నిమిషంలో డచ్ జట్టుకు దక్కిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని డ్రాగ్ ఫ్లికర్ యిబీ జాన్సెన్ గోల్‌గా మలిచి నెదర్లాండ్స్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించింది.
ఆ తర్వాత వెనుకబడిన అర్జెంటీనా ద్వితీయార్థంలో దాడులను తీవ్రతరం చేయగా, 54వ నిమిషంలో లభించిన 8వ పెనాల్టీ కార్నర్‌లో కెప్టెన్ మరియా గ్రానాటో రీబౌండ్ గోల్ కొట్టి స్కోరును 1-1తో సమం చేసింది. ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ షూటౌట్‌కు దారితీసింది. షూటౌట్‌లో అర్జెంటీనా ప్లేయర్లు విక్టోరియా గ్రానాటో, బ్రిసా, సోఫియా కైరోలు ఒత్తిడికి లోనుకాకుండా క్లినికల్ ఫినిషింగ్‌తో గోల్స్ కొట్టి జట్టును గెలిపించారు.
మరోవైపు నెదర్లాండ్స్ ఆటగాళ్లు పీన్ సాండర్స్, ఫెలిస్ ఆల్బర్స్ అవకాశాలను వృథా చేసుకోవడంతో మారీన్ వీన్ చేసిన ఒక్క గోల్ సరిపోలేదు. చివరికి అర్జెంటీనా 3-1తో విజయం సాధించి ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది. గతంలో 2002, 2010 ప్రపంచ కప్ ఫైనల్స్‌లోనూ నెదర్లాండ్స్‌ను ఓడించి విజేతగా నిలిచిన చరిత్ర అర్జెంటీనాకు ఉంది. సరిగ్గా అదే రికార్డును మళ్లీ పునరావృతం చేస్తూ డచ్ జట్టుపై ఫైనల్లో తమకున్న ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది.












