దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం అవ్వగా.. 8:30 గంటలకే పరీక్ష కేంద్రాల వద్ద ప్రధాన గేట్లు మూసివేసినట్టు తెలిసింది. పలుచోట్ల నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను లోనికి అనుమతించలేదని సమాచారం. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష కొనసాగనుంది. ఈ క్రమంలోనే పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
అయితే, దేశవ్యాప్తంగా 2.73 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరు అయినట్టు తెలిసింది. ఏపీ, తెలంగాణలోనూ భారీ సంఖ్యలో అభ్యర్థులు పరీక్షకు హాజరు అయ్యారు. ఏపీలో 21 జిల్లాల్లో 76 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఏపీ నుంచి 18,700 మంది అభ్యర్థులు పరీక్ష రాస్త్ున్నారు. ఇక తెలంగాణలో 14 జిల్లాల్లో 56 పరీక్షా సెంటర్లు ఏర్పాటు చేయగా.. రాష్ట్రం నుంచి 17,600 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు అయినట్టు తెలిసింది. ఉదయం 7 గంటల నుంచే పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులను అనుమతించినట్టు సమాచారం.
ఇదిలాఉండగా, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలో నీట్ పీజీ పరీక్షా కేంద్రానికి ఓ అభ్యర్థి మద్యం సేవించి హాజరైనట్టు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ రిజ్వాన్ అనే విద్యార్థి ఫుల్లుగా మద్యం సేవించి పరీక్షా కేంద్రానికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.అతను పరీక్షా హాల్‌లోకి వెళ్లిన అనంతరం సిబ్బంది అతని తీరును గమనించారు. కాసేపటికే పరీక్ష రాయకుండా హాల్ నుంచి బయటకు పంపించి వేసినట్టు తెలిసింది.
మద్యం వాసన రావడం, పరీక్ష రాస్తున్న తోటి విద్యార్థులు ఇబ్బంది పడుతుండటంతో బయటకు పంపించినట్టు సమాచారం. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.ఇదిలాఉండగా, నీట్ యూజీ పేపర్ లీకేజీ అంశం దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. సీజేఐ వ్యాఖ్యల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుక.. దేశవ్యాప్తంగా నిరసనలు, ఏకంగా కేంద్రమంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది.ఈ క్రమంలోనే కేంద్రం యాంటీ పేపర్ లీకేజీ బిల్లును తీసుకొచ్చింది.. ఈ క్రమంలోనే ఎన్టీఏ అధికారులు చాలా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది.












