పంజాబ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరిగింది. ప్రధాన పార్టీలు రాబోయే ఎన్నికల్లో గెలుపుపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే అక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.ఈసారి ఎలాగైనా పంజాబ్‌లో పాగా వేయాలని బీజేపీ భావిస్తుండగా..అధికారం నిలదొక్కుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్నది. ఈ మేరకు వేగంగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. అయితే, దీని వెనుక బీజేపీ హస్తం ఉందని అధికార ఆప్ పార్టీ నేతలు ఆరోపిస్తుండగా..తమకు సంబంధం లేదని బీజేపీ కొట్టిపారేసింది. పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ జిల్లా మమ్‌దోట్ పట్టణంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు గుర్‌ప్రీత్ సింగ్ గోపీని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.
గోపి ద్విచక్రవాహనంపై వెళ్తున్న సమయంలో కారులో వచ్చిన దుండగులు వెంబడించి మరీ విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు సమాచారం. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గుర్‌ప్రీత్ సింగ్ గోపీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అయితే, బాధితుడు గోపీ తన మిత్రుడు హర్‌ప్రీత్ అనే వ్యక్తితో కలిసి మోటార్ సైకిల్‌పై వెళ్తున్న క్రమంలో కారులో వచ్చిన దుండగులు వారిని వెంబడించారు. అదే టైంలో గోపి మిత్రులు కారులో ఫాలో అవుతుండగా.. వారి వాహనంపైనా నిందితులు కాల్పులు జరిపినట్లు తెలిసింది.
అయితే, అదృష్టవశాత్తు గోపి మిత్రులకు ఏమీ కాలేదని తెలిసింది. ఈ దారుణ హత్య వెనుక పాత కక్షలతో పాటు ఎన్నికలకు సంబంధించిన వివాదం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్పీ భూపిందర్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ.. రెండు వర్గాల మధ్య పాత కక్షలు ఉన్నాయని, ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాల్పులు జరిపిన నిందితులను ఇప్పటికే గుర్తించామని, ప్రధాన నిందితుడికి నేరచరిత్ర ఉందన్నారు. వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని, అందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.












