ప్రకృతి ఉగ్రరూపం దాల్చితే ఎలా ఉంటుందో గతంలో ఎన్నోసార్లు చూశాం.. కానీ ప్రస్తుతం నేపాల్‌లో కనిపిస్తున్న పరిస్థితులు మాత్రం వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. హిమాలయాల్లో హిమానీనదం కూలిపోవడంతో భారీగా మంచు, రాళ్లు, బురద ఒక్కసారిగా వరదలా దూసుకొచ్చి.. గ్రామాలు, రహదారులు, వంతెనలను ముంచెత్తాయి. క్షణాల్లోనే ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలు శిథిలాల దిబ్బలుగా మారిపోయాయి.
ఈ ఘోర విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. ఇంకా ఎంతోమంది గల్లంతు అయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రకృతి ముందు మనిషి ఎంతటి శక్తివంతుడైనా ఆ ప్రకోపం ముందు ఎందుకు పనికిరాని వాడే అని నేపాల్ విపత్తు మరోసారి కళ్లకు కట్టినట్టు చూపించింది. అప్పటి వరకు ఆనందంగా ఉన్న బ్రతుకుల్లో ఒక్కసారిగా కమ్ముకున్న చీకట్లు.. క్షణాల్లోనే మృత్యు ఘంటికలు మోగించాయి..
ఇంతటి దారుణ పరిస్థితుల్లో కూడా ఓ చిన్నారి ప్రాణాలతో బయటపడటం.. ఈ విషాదంలో ఓ అద్భుతమైన అంశంగా మారింది. చుట్టూ వరద నీరు, మట్టి, శిథిలాలు.. ఎటు చూసినా మృత్యువు తాండవం చేస్తున్న వేళ.. ఆ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది.. మృత్యువు అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చిన ఆ బాలిక కథ ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. ప్రకృతి ఎంతటి ఉగ్రరూపం దాల్చినా.. భగవంతుని ఆశీస్సులు, బ్రతకాలన్న కోరిక, ప్రాణం నిలబెట్టుకోవాలన్న పట్టుదల ఉంటే.. ఆ ఆశ సజీవంగా ఉంటుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
స్థానికుల కథనం ప్రకారం.. ఈ విపత్తు జరిగిన మూడు రోజుల తర్వాత, ఆరేళ్ల బాలికను రెస్క్యూ సిబ్బంది ప్రాణాలతో కాపాడారు.. రసూవా జిల్లాలోని టిమురే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. భోటే కోశి నదికి వచ్చిన వరదల వల్ల గల్లంతైన వారి కోసం ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ బృందం శుక్రవారం గాలిస్తుండగా, శిథిలాల కింద నుంచి చిన్నారి ఏడుపులు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన బృందాలు, బాలికను సురక్షితంగా బయటకు తీశాయి.
రక్షించిన ఆ బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు శనివారం ఖాట్మండుకు తరలించారు. ఇక నేపాల్‌లో సంభవించిన ఘోర ప్రమాదంలో ఈ ఘటన ఒక అద్భుతం అని అంటున్నారు.. మరోవైపు నేపాల్‌లో బుధవారం హిమానీనదం కూలిపోవడంతో ఈ ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సహాయక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి.
కాగా నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకటించిన నివేదిక ప్రకారం..ఈ ఆకస్మిక వరదల కారణంగా 675 మందికి పైగా మరణించగా.. మరో 2,498 మంది గల్లంతయ్యారు. అలాగే 589మంది విదేశీయులతో సహా మొత్తం 753 మంది పర్యాటకుల ఆచూకీ లభించలేదని సమాచారం..












