తెలంగాణ

కేసీఆర్ చనిపోవాలని కోరుకోవడం తప్పు: కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆరోగ్యం, వ్యక్తిగత అంశాలపై తోటి కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ చనిపోవాలని ఏ ఒక్కరూ కోరుకోవడం కరెక్ట్ కాదని ఆయన స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆరోగ్యం, వ్యక్తిగత అంశాలపై తోటి కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ చనిపోవాలని ఏ ఒక్కరూ కోరుకోవడం కరెక్ట్ కాదని ఆయన స్పష్టం చేశారు. సొంత పార్టీకి చెందిన షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తప్పుబడుతూ దానం నాగేందర్ ఆయనకు బహిరంగంగానే గట్టి చురకలంటించారు.

 రాజకీయాల్లో నాయకుల మధ్య సిద్ధాంతపరమైన, విధానపరమైన విభేదాలు ఉండటం సహజమని, అయితే ఒక వ్యక్తి ఆరోగ్యం, జీవనంపై చిల్లర వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కృతి కాదని దానం నాగేందర్ హితవు పలికారు. మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపైనా, ప్రత్యర్థి పార్టీల విధానాలపై మాత్రమే రాజకీయ పోరాటం చేయాలని హితబోధ చేశారు. దిగజారుడు వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీ ప్రతిష్టకే కాకుండా నాయకుల వ్యక్తిత్వానికి కూడా నష్టం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

 ఇటీవల షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కేసీఆర్‌ను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీఆర్‌ఎస్ శ్రేణులు ఈ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడుతూ నిరసనలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకుడైన దానం నాగేందర్ స్పందిస్తూ.. వ్యక్తిగత కక్షలకు, శాపనార్థాలకు రాజకీయాల్లో తావులేదని, కేసీఆర్‌ లాంటి సీనియర్ నాయకుడి పట్ల మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని స్వపక్ష నేతకే హితవు పలికారు.

 కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని తమ నాయకులకు సూచించారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసేటప్పుడు భాష, సంస్కృతి విషయంలో హద్దులు దాటకూడదని దానం నాగేందర్ స్పష్టం చేశారు. స్వపక్ష ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత ఖండించడంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

#DanamNagender#KCR#VeerlapalliShankar#CongressVsBRS#TelanganaPolitics#KhairatabadMLADanam#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి