Raj Gopal Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి పదవుల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేబినెట్‌లో చోటు దక్కుతుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే నిన్న మొన్నటి వరకు సొంత ప్రభుత్వంపైనే, ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డిపైనే బాహాటంగా విమర్శలు చేసిన రాజగోపాల్‌రెడ్డి.. ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ కావడం వెనుక కారణమేంటన్న చర్చ మొదలైంది.
మంత్రి పదవిపై హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ రావడంతోనే ఆయన తన వైఖరిని మార్చుకున్నారనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై బహిరంగంగానే ప్రశ్నలు సంధించిన ఆయన.. ఇప్పుడు మాత్రం సీఎంతో సన్నిహితంగా కనిపించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో “మంత్రి పదవి కోసమే రాజగోపాల్‌రెడ్డి మెత్తబడ్డారా?” అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అయితే ఇదే సమయంలో కాంగ్రెస్‌లోని కొన్ని వర్గాలు మరో ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. సొంత పార్టీ ప్రభుత్వంపైనే బాహాటంగా విమర్శలు చేసిన వ్యక్తికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలన్నది వారి వాదన. అంతేకాదు.. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యమేనా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. అలాంటప్పుడు రాజగోపాల్‌రెడ్డికి కూడా కేబినెట్‌లో స్థానం కల్పిస్తే పార్టీ అంతర్గత సమీకరణాలపై ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
అయితే రాజగోపాల్‌రెడ్డి మాత్రం ఈ ప్రచారంపై మరోలా వివరణ ఇస్తున్నారు. తనకు మంత్రి పదవిపై పార్టీ హైకమాండ్ పూర్తి స్పష్టత ఇచ్చిందని ఆయన ఇటీవల మీడియా చిట్‌చాట్‌లో చెప్పారు. ఇందులో సీఎం రేవంత్‌రెడ్డి కాంప్రమైజ్ కావాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం ఎమ్మెల్యేగా సీఎంను, డిప్యూటీ సీఎంను కలవడం సాధారణ ప్రక్రియేనని అంటున్నారు.
తనకు, రేవంత్‌రెడ్డికి మధ్య కావాలనే కొందరు విభేదాలు సృష్టిస్తున్నారని రాజగోపాల్‌రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. లేనిపోని ఆరోపణలతో తనపై తప్పుడు ప్రచారం చేయొద్దని కోరుతున్నారు.
అయితే అసలు ప్రశ్న మాత్రం అలాగే ఉంది. పార్టీ అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వెళ్లి తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చిన రాజగోపాల్‌రెడ్డికి ఇప్పుడు మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి? గతంలో సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేసిన ఆయనకు కేబినెట్‌లో చోటు కల్పించడం ద్వారా పార్టీకి వచ్చే రాజకీయ ప్రయోజనం ఏంటి? అన్న చర్చ కాంగ్రెస్‌లో కొనసాగుతోంది.
అందుకే రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవిపై ఆశలు ఎందుకు చావడం లేదన్నదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. హైకమాండ్ నిజంగానే హామీ ఇచ్చిందా? లేక రాజకీయ సమీకరణాల్లో భాగంగానే ఈ ప్రచారం జరుగుతోందా? అన్నది తేలాల్సి ఉంది.








