AMR GROUP : పశ్చిమ బెంగాల్‌లో కలకలం రేపిన అక్రమ బొగ్గు మైనింగ్, నిధుల మళ్లింపు వ్యవహారం ఇప్పుడు హైదరాబాద్‌లోని ప్రముఖ మౌలిక వసతుల సంస్థ 'ఏఎంఆర్ గ్రూప్' మెడకు చుట్టుకుంది. దాదాపు రూ.650 కోట్ల భారీ స్కామ్, హవాలా లింకులపై గురిపెట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు.. ఏఎంఆర్ అధినేత ఎ.మహేశ్‌రెడ్డి లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఏకకాలంలో మెరుపు దాడులు చేపట్టారు.
హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, కోల్‌కతాలో రైడ్స్
హైదరాబాద్ బంజారాహిల్స్ కమలాపురి కాలనీలోని ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ ప్రధాన కార్యాలయం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని మహేశ్‌రెడ్డి నివాసాలు, అనుబంధ కంపెనీల్లో ఈడీ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, కోల్‌కతా, జార్ఖండ్‌లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. ఢిల్లీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో స్థానిక ఈడీ అధికారులు కీలక పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు, భారీ ఆర్థిక లావాదేవీల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
రూ.650 కోట్ల బొగ్గు సిండికేట్.. రూ.60 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు
జార్ఖండ్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్–దుర్గాపూర్ ఇండస్ట్రీ ఏరియాలకు అక్రమంగా బొగ్గును తరలిస్తూ, డెలివరీ ఆర్డర్ హోల్డర్లు, రవాణాదారుల నుంచి 'గుండా ట్యాక్స్', 'రంగదారి' పన్నుల పేరిట గత ఐదేళ్లలో ఏకంగా రూ.650 కోట్లకు పైగా అక్రమార్జనకు పాల్పడినట్లు ఈడీ ప్రాథమిక ఆధారాలు సేకరించింది.
ఈ దర్యాప్తులో దాదాపు రూ.60 కోట్లకు పైగా విలువైన అనుమానాస్పద లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు, హవాలా లావాదేవీలు, బ్లాక్ మనీ వ్యవహారాలకు సంబంధించి గతంలో ఐటీ శాఖ జరిపిన రైడ్స్‌లో దొరికిన లీడ్ ఆధారంగా ఈడీ మరింత లోతుగా విచారణ చేపట్టింది.
ఈ అక్రమ రవాణ దందా ఎలాంటి ఆటంకం లేకుండా సాగేందుకు స్థానిక రాజకీయ ప్రముఖులు, పలువురు ప్రభుత్వ అధికారులకు భారీగా లంచాలు అందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో చిన్మయ్ మోండల్, కిరణ్ ఖాన్‌లతో పాటు మరో ముగ్గురిపై ఈడీ ప్రత్యేక కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
బడా మైనింగ్ కాంట్రాక్టులపై నజర్
సింగరేణి, కోల్ ఇండియా అనుబంధ కంపెనీలతో పాటు ఇండియా సిమెంట్స్, గ్రాసిమ్ వంటి దిగ్గజ సంస్థలకు ఏఎంఆర్ గ్రూప్ ఓపెన్‌కాస్ట్ మైనింగ్ కాంట్రాక్టులు నిర్వహించింది. బొగ్గు, సున్నపురాయి, బాక్సైట్ తవ్వకాలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జలయజ్ఞం కింద భారీ సాగునీటి ప్రాజెక్టులు, బ్యారేజీలు, హైవేల నిర్మాణాలు చేపట్టింది. అంతేకాకుండా నేపాల్, భూటాన్ వంటి పొరుగు దేశాల్లోనూ భారీ కాంట్రాక్టులు పూర్తి చేసింది. ఈ భారీ ప్రాజెక్టుల్లో జరిగిన నిధుల బదిలీలు, అనుబంధ సంస్థల రికార్డులను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
పాపిరెడ్డిపాళెం నుంచి 'బంగారు రెడ్డి'గా ప్రస్థానం
నెల్లూరు జిల్లా పాపిరెడ్డిపాళెం గ్రామానికి చెందిన ఎ.మహేశ్‌రెడ్డి 1992లో తన సోదరుడు గిరీష్‌రెడ్డితో కలిసి 'ఏఎంఆర్ కన్‌స్ట్రక్షన్స్' పేరుతో చిన్న సంస్థగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనతికాలంలోనే వేల కోట్ల టర్నోవర్‌తో ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్‌గా విస్తరించారు. సినీ నిర్మాతగా చిత్రాలు నిర్మించిన ఆయన.. షిర్డీ సాయిబాబా సంస్థాన్‌కు 145 కిలోల బంగారంతో చేసిన సింహాసనం, బంగారు తొడుగులు విరాళంగా ఇచ్చి దేశవ్యాప్తంగా ‘బంగారు రెడ్డి’గా గుర్తింపు పొందారు. గతంలో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ట్రస్టీగానూ వ్యవహరించారు.
వ్యాపార, రాజకీయ వర్గాల్లో ఎంతో పలుకుబడి ఉన్న మహేశ్‌రెడ్డి సంస్థలపై ఈడీ ఒకేసారి దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. సోదాల్లో స్వాధీనం చేసుకున్న ఆధారాలను బట్టి అరెస్ట్ లేదా నోటీసులపై ఈడీ నిర్ణయం తీసుకునే అవకాశముంది.











