Flipkart : ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు ఏడాదంతా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసే అతిపెద్ద పండుగ రానే వస్తోంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తీసుకొచ్చే 'బిగ్ బిలియన్ డేస్' సేల్ కోసం దేశవ్యాప్తంగా కోట్ల మంది వేచి చూస్తుంటారు. అయితే, కంపెనీ అధికారికంగా ప్రకటించకముందే ఈ మెగా సేల్ ఎప్పుడు మొదలవుతుందనే పక్కా సమాచారం నెట్టింట లీకై సంచలనం సృష్టిస్తోంది.
సోషల్ మీడియాలో లీకైన స్క్రీన్‌షాట్.. వైరల్ అవుతున్న తేదీలు
'ఎక్స్'లో ఓ యూజర్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం.. 'బిగ్ బిలియన్ డేస్ 2026' సేల్ అక్టోబర్ 9 నుంచి స్టార్ట్ కానుంది. ఈ వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాకుండా, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ యూజర్స్‌కి ఎప్పటిలాగే ప్రత్యేక ఇంపార్టెన్స్ దక్కనుంది. నార్మల్ కస్టమర్ల కంటే ఒక రోజు ముందే, అంటే అక్టోబర్ 8 నుంచే వారికి ఎర్లీ ఎంట్రీ లభించనున్నట్లు తెలుస్తోంది.
బ్యాంక్ ఆఫర్లు.. తక్షణ తగ్గింపులు
లీకైన వివరాల ఆధారంగా చూస్తే, ఈసారి ప్రముఖ బ్యాంకింగ్ పాట్నర్స్ యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై 10 శాతం వరకు తక్షణ తగ్గింపు లభించనుంది. అయితే కనీస కొనుగోలు మొత్తం ఎంత ఉండాలి? గరిష్టంగా ఎంత వరకు రాయితీ వర్తిస్తుంది? అనే నియమ నిబంధనలపై స్పష్టత రావాల్సి ఉంది.
మార్కెట్లో భారీ అంచనాలు
గత ఏడాది సెప్టెంబర్ ఆఖర్లోనే నిర్వహించిన ఈ సేల్‌లో యాపిల్, శాంసంగ్, మోటరోలా వంటి దిగ్గజ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, హోమ్ అప్లయన్సెస్‌పై ఊహించని ధరల తగ్గింపు కనిపించింది. రష్ అవర్ డీల్స్, లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లతో కస్టమర్స్ భారీగా ఆదా చేసుకున్నారు. ఈసారి కూడా పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులను ఆకర్షించేందుకు అదే స్థాయి భారీ డీల్స్ ఉంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
అధికారిక ప్రకటన వచ్చేదాకా ఆగాల్సిందే!
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ లీక్ కలకలం రేపుతున్నప్పటికీ, దీనిపై ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యం నుంచి ఎలాంటి అధికారిక ధ్రువీకరణ రాలేదు. సంస్థ అంతర్గత ప్రణాళికలను బట్టి తేదీల్లో స్వల్ప మార్పులు చేర్పులు ఉండే అవకాశమూ లేకపోలేదు. పూర్తి షెడ్యూల్, బ్రాండ్ల వారీ ఆఫర్ల వివరాలు బయటకు రావాలంటే కంపెనీ లాంఛనంగా ప్రటించే వరకు వేచి చూడాల్సిందే. అయితేనేం, షాపింగ్ లిస్ట్ రెడీ చేసుకునేందుకు ఈ లీక్ అయిన సమాచారం కొనుగోలుదారులకు మంచి ఊపునిచ్చిందనే చెప్పాలి.








