CM Revanth Reddy : "ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా.. అక్షర జ్ఞానానికి దూరమైతే సమాజంలో వెనుకబడిపోవడం ఖాయం. ఒక మనిషి తలరాతను, ఒక జాతి భవిష్యత్తును సమూలంగా మార్చే ఏకైక తిరుగులేని ఆయుధం విద్య మాత్రమే" అని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా స్పష్టం చేశారు. విద్య, భవిష్యత్ తరాల పునర్నిర్మాణంపై మాట్లాడిన సీఎం, రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ప్రకటించారు.
వెనుకబాటుతనానికి పేదరికం కాదు.. నిరక్షరాస్యతే మూలం!
2024లో రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర సామాజిక సర్వే (సీపెక్) నివేదికలను ఉటంకిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. సామాజికంగా ఎవరైనా వెనుకబడి ఉన్నారంటే దానికి ప్రధాన కారణం చదువు లేకపోవడమేనని ఆ సర్వే తేల్చిచెప్పిందన్నారు. "ప్రపంచవ్యాప్తంగా సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ సంస్కరణలు వచ్చిన తర్వాత విద్యా ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా మన బోధనా విధానాన్ని తీర్చిదిద్దాలి. దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను నెలకొల్పిన పండిట్ నెహ్రూ మార్గంలో నడుస్తూ.. నేటి జెన్ జీ తరంతో పాటు రాబోయే జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరాల భవితవ్యాన్ని ప్రభుత్వ పాఠశాలల తరగతి గదుల్లోనే నిర్మిస్తాం" అని సీఎం ధీమా వ్యక్తం చేశారు.
రికార్డు సమయంలో 10,600 టీచర్ పోస్టుల భర్తీ!
గత పదేళ్ల పాలనతో పోలిస్తే తమ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో గణాంకాలే చెబుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు బయటపెట్టారు. గత పాలకులు దశాబ్ద కాలంలో కేవలం 7,857 ఉపాధ్యాయ నియామకాలు మాత్రమే చేపడితే.. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే ఏకంగా 11,000 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. అంతేకాకుండా ఎక్కడా చిన్న అవినీతి ఆరోపణకు తావులేకుండా కేవలం 55 రోజుల రికార్డు వ్యవధిలోనే 10,600 మంది ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేసి చరిత్ర సృష్టించామని గుర్తుచేశారు. గతంలో విద్యా రంగానికి తగ్గుతూ వచ్చిన బడ్జెట్ కేటాయింపులను తాము క్రమంగా పెంచుతున్నామని, అసెంబ్లీలో సభ్యులు అందించిన విలువైన సూచనలపై త్వరలోనే ప్రత్యేక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలను దేశానికే రోల్ మోడల్‌గా నిలబెడతామని సీఎం సభలో స్పష్టం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలోనూ లేని విద్యా కమిషన్ ఏర్పాటు
రాష్ట్రంలో విద్యా రంగాన్ని గాడిన పెట్టేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నడూ లేని విధంగా ఒక ప్రత్యేక 'విద్యా కమిషన్'ను కొలువుదీర్చినట్లు సీఎం వెల్లడించారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్ర పరిస్థితులకు తగిన సరికొత్త మార్గదర్శకాలు సిద్ధం చేసేందుకు కేశవరావు కమిటీని రంగంలోకి దించామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 28,163 ప్రభుత్వ విద్యాసంస్థల్లో 28.77 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా, 1.57 లక్షల మంది సిబ్బంది సేవలందిస్తున్నారని వివరించారు. రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ప్రకారం ప్రతి 30 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాల్సి ఉండగా.. తెలంగాణలో ప్రతి 17 మంది విద్యార్థులకే ఒక ఉపాధ్యాయుడు అందుబాటులో ఉండేలా విద్యా ప్రమాణాలను పెంచామని చెప్పారు.









