రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు. హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘ఈ రోజు మనందరికీ ఎంతో భావోద్వేగమైన రోజు.. పోలీస్ అమరులను స్మరించుకునే రోజు. సమాజం కోసం ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరులకు నివాళులు’ అని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా దేవ్ సింగ్, ప్రమోద్ కుమార్, గాజుల సౌమ్య విధి నిర్వహణలో మరణించారని, శాంతిభద్రతల పరిరక్షణలో వారి త్యాగాలను మరువలేం అన్నారు. అమరుల కుటుంబం ఒంటరి కాదని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. రాష్ట్ర అభివృద్ధి శాంతి భద్రతల పరిరక్షణ ఎంతో ముఖ్యమని, అందుకే పోలీస్ శాఖకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.పోలీస్ శాఖలో మరో 5 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నామని తెలిపారు.
పోలీసు శాఖలో అన్ని ఖాళీలు భర్తీ..
2027 లోగా పోలీస్ శాఖలో అన్ని ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 112 డీఎస్పీలను నియమించామన్నారు.ట్రాన్స్ జెండర్స్‌ను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించి వారి ఆత్మగౌరవాన్ని పెంచామని, గతంలో విధి నిర్వహణలో వీరమరణం పొందిన కానిస్టేబుళ్ల కు రూ.40 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఉంటే దానిని ఏకంగా రూ. కోటికి పెంచామని తెలిపారు.
హెడ్ కానిస్టేబుళ్ళు,ఏఎస్ఐలకు గతంలో రూ.45 లక్షలుగా ఉన్న పరిహారాన్ని రూ.కోటికి పెంచామని, ఎస్ఐలకు రూ.45 లక్షలు, ఇన్స్పెక్టర్లకు రూ.50 లక్షలు ఉంటే దీనిని రూ.1.25 కోట్లకు పెంచామన్నారు. డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులకు రూ.50 లక్షలు ఉంటే మేం రూ.1.50 కోట్లకు పెంచినట్టు గుర్తుచేశారు. ఎస్పీ, ఐపీఎస్ అధికారులకు రూ. కోటి పరిహారం ఉంటే దానిని రూ.2 కోట్లకు పెంచామన్నారు.ఇది కేవలం ఆర్ధిక సహాయం కాదు, పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే గౌరవమని తెలిపారు.
హోంగార్డులకు రూ.10 లక్షలు..
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించి హోమ్ గార్డు నుంచి డీజీపీ స్థాయి వరకు వారి పిల్లలకు ఇందులో అవకాశం కల్పించామని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయే హోంగార్డుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నామన్నారు. దీనిని రూ.10 లక్షలకు పెంచాలని డీజీపీని ఆదేశిస్తున్నట్టు వెల్లడించారు. కాలంతో పాటు నేర స్వభావం మారుతోందని, కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖను ఆధునీకరించాలని నిర్ణయించామన్నారు.ఆధునిక సాంకేతికతను వినియోగించాలని నిర్ణయం తీసుకున్నామని, సాంకేతికత ఎంత పెరిగినా పోలీసులు మానవీయ దృక్పథం మారకూడదన్నారు. డ్రగ్స్, గంజాయి వ్యాప్తి అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు.యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా చూడాలన్నారు.
డ్రగ్స్ నియంత్రణలో ఈగల్ ఫోర్స్ పనితీరును, డీజీపీ ని అభినందిస్తున్నానని చెప్పారు.కల్తీ ఆహారంపై ఉక్కు పాదంతో అణచివేసేందుకు టీజీ సేఫ్ ను తీసుకొచ్చామన్నారు. షీ టీమ్స్ సేవలను కొనసాగిస్తూ మహిళల భద్రతను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. మహిళలకు అండగా నిలిచే సామాజిక బాధ్యతను పెంచడానికి స్టాండ్ విత్ హర్ కార్యక్రమాన్ని ఈ ఏడాది మార్చిలో ప్రారంభించామని చెప్పారు. మహిళలు, పిల్లలకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ రక్షణ అందించడానికి ఏప్రిల్‌లో స్పందన – తక్షణ రక్షణ బృందాలను ప్రారంభించామని వెల్లడించారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసుల్లో పోలీసులు మరింత సున్నితంగా వ్యవహరించాలని చెప్పారు.
క్రమశిక్షణ,నిజాయితే మీ గౌరవం, బలం..
పోలీసులకు క్రమశిక్షణే బలం, నిజాయితే మీ గౌరవమని అన్నారు. ప్రజలకు మీరు అందించే భరోసాయే మీకు లభించే గొప్ప గుర్తింపు అని చెప్పారు.బాధితులకు న్యాయం అందించడంలో జాప్యం జరగకూడదని, మహిళల భద్రత కేవలం పోలీసు శాఖ బాధ్యత కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలన్నారు. చివరిగా పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నానని, మీరు కోల్పోయిన వ్యక్తిని ఎవరూ తిరిగి తీసుకురాలేరని, మీ కుటుంబాల్లో ఏర్పడిన లోటును ఎవరూ పూర్తిగా భర్తీ చేయలేరన్నారు.
కానీ మీ బాధలో మీరు ఒంటరివారు కాదని, మీకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పోలీసుశాఖ అండగా ఉంటుందని, తెలంగాణ సమాజం అండగా ఉంటుందన్నారు.ప్రజల భద్రతకు మీరు అండగా నిలవాలి, మీ సంక్షేమానికి, మీ కుటుంబాల భవిష్యత్తుకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అమరుల త్యాగాలను గౌరవిద్దాం, వారి ఆశయాలను కొనసాగిద్దాం, శాంతియుతమైన, సురక్షితమైన, అభివృద్ధి చెందిన తెలంగాణను నిర్మించుకుందామన్నారు.


