నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్, ఆయన భాగస్వామి నికోలస్ కీనన్ సరోగసీ ద్వారా తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. తమ జీవితంలోకి రాబోయే తొలి సంతానం కోసం తాము ఎంతగానో ఎదురుచూస్తున్నామని, 2027లో చిన్నారిని ఆహ్వానించనున్నట్లు ఈ స్వలింగ సంపర్క జంట సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఈ ప్రక్రియ పూర్తిగా వాణిజ్యపరమైన ప్రయోజనాలు లేకుండా, స్నేహితుల సహకారంతోనే జరిగిందని జెట్టెన్ ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రాట్స్ 66 (D66) పార్టీ స్పష్టం చేసింది. నెదర్లాండ్స్ చట్టాలకు లోబడి ఐవీఎఫ్ పద్ధతిలో ఈ గర్భధారణ జరిగిందని, ఎగ్ డోనర్‌గా, సరోగేట్ తల్లుగా వ్యవహరించిన తమ స్నేహితురాలికి జంట కృతజ్ఞతలు తెలిపింది.
గతేడాది జరిగిన ఎన్నికల్లో డచ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా రికార్డు సృష్టించిన జెట్టెన్, ఆర్జెంటీనా హాకీ క్రీడాకారుడు నికోలస్ కీనన్‌తో 2024 నవంబరులో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేసవిలో పెళ్లి జరగాల్సి ఉండగా.. ప్రధాని బాధ్యతల కారణంగా వివాహాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
రాజకీయాల్లోకి రాకముందు మేనేజ్‌మెంట్ విద్యనభ్యసించి, అథ్లెట్‌గానూ రాణించిన జెట్టెన్ గతంలో వాతావరణ, ఇంధన శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే, బిడ్డ జన్మించిన తర్వాత ప్రధాని విధులకు కొద్దిరోజులు మాత్రమే విరామం తీసుకుంటారని, ఎక్కువ కాలం సెలవులో ఉండబోరని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.


