ఆటో డ్రైవర్ , ఇద్దరు అమ్మాయిలు పరస్పరం రోడ్డు మీద దాడులు చేసుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆటో చార్జీల విషయంలోనే ఈ ఘర్షణ వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే... ఇద్దరు అమ్మాయిలు ఆటోలో ఓ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ డబ్బులు విషయంలో ఆటో డ్రైవర్‌తో వాగ్వాదం జరిగినట్టు సమాచారం. ముందుగా అనుకున్న అమౌంట్ కంటే డ్రైవర్ ఎక్కువగా డిమాండ్ చేశాడని యువతులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య మాట మాట పెరిగి దాడులు చేసుకునే వరకు వెళ్లినట్టు తెలిసింది. ఇద్దరు అమ్మాయిలు, ఆటో డ్రైవర్ పరస్పరం దాడులు చేసుకుంటున్న సమయంలో గుర్తుతెలియని వాహనదారుడు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయ్యింది.
ఆటో డ్రైవర్ యువతుల మీద పిడిగుద్దుల వర్షం కురిపించిన దృశ్యాలు వైరల్ కావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వీడియోని చూసిన వెంటనే ఇద్దరు యువతులను అధికారులు సంప్రదించినట్టు తెలిసింది. పోలీస్‌స్టేషన్‌కు రమ్మని పిలవగా ఒకట్రెండు రోజులు సమయం కావాలని యువతులు కోరినట్టు సమాచారం.
ఇదే టైంలో ఆటో డ్రైవర్‌ని గుర్తించి ఘటనపై మాట్లాడేందుకు స్టేషన్‌కు పిలువగా.. పీఎస్‌కు వెళ్లిన సదరు డ్రైవర్ అక్కడ ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేశారు. ఆటో అద్దెకు తీసుకొని డబ్బు చెల్లింపు విషయంలో గొడవ పడ్డారని డ్రైవర్ వివరణ ఇచ్చారు.ఇద్దరు యువతులు మద్యం మత్తులో ఉండి తనను దూషించారని ఆటో డ్రైవర్ పేర్కొన్నట్టు తెలిసింది.
మొదట వాళ్లే తనపై దాడి చేశారని దాంతో తాను ప్రతిదాడి చేసినట్లు పోలీసులకు వెల్లడించారు. కాగా, యువతులు ఫిర్యాదు చేస్తే తాము తగిన చర్యలు తీసుకుంటామని ఓ పోలీస్ అధికారి పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనలో కొందరు యువతలకు మద్దతు ఇస్తుంటే.. మరికొందరు ఆటో డ్రైవర్‌ను సపోర్టు చేస్తున్నారు. యువతుల సైడ్ తప్పులేకుంటే ఇప్పటికే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలిగా.. చేయలేదు అంటే అర్థం ఏమిటి? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.












