The Paradise: ప్రియదర్శి.. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా, తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ ఈ పేరు బాగా వినిపిస్తోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా..యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాలో కమెడియన్ ప్రియదర్శి పోషించిన "ఎమ్మెల్యే శంకరన్న" పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాత్ర మేకోవర్, తెలంగాణ యాస, బాడీ లాంగ్వేజ్, హావభావాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గుర్తు చేసేలా ఉండటంతో సినిమా విడుదలకు ముందు, ఆ తర్వాత కూడా భారీ స్థాయిలో చర్చ జరిగింది.
ఈ నేపథ్యంలో ప్రియదర్శిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు సన్మానించారు. ‘ది ప్యారడైజ్’లో ఆయన చేసిన పాత్రను అభినందిస్తూ హరీష్ రావు ప్రత్యేకంగా సత్కరించడం ఆసక్తికరంగా మారింది. ఒక నటుడిగా ప్రియదర్శి చూపించిన ప్రతిభకు ఈ సన్మానం గుర్తింపుగా నిలిచింది. దీంతో, అటు రాజకీయ వర్గాలలో ఇటు సినీ వర్గాలలో ప్రియదరి గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గత చిత్రం కోర్టు మూవీలో పోషించిన లాయర్ పాత్ర..ఇప్పుడు ప్యారడైజ్ మూవీలో పోషించిన శంకరన్న పాత్రలను గుర్తు చేసుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గుర్తు చేసిన శంకరన్న:
‘ది ప్యారడైజ్’లో ప్రియదర్శి ఎమ్మెల్యే శంకరన్నగా కనిపించారు. ఈ పాత్రను నేరుగా కేసీఆర్ పాత్రగా పేర్కొనకపోయినా.. ఆయన లుక్, డైలాగ్ డెలివరీ, తెలంగాణ యాస, బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ మాత్రం కేసీఆర్‌ను గుర్తు చేసేలా ఉన్నాయని ప్రేక్షకులు, నెటిజన్లు కామెంట్లు చేశారు.
ముఖ్యంగా సినిమాలో ప్రియదర్శి కనిపించే సన్నివేశాలు తక్కువ సమయమే ఉన్నప్పటికీ, ఆ పాత్రకు మంచి ఇంపాక్ట్ వచ్చింది. స్క్రీన్ మీద శంకరన్న కనిపించగానే జనాలు ఒకటే ఈలలేసి గోల చేశారు. థియేటర్స్ ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. దీంతో సోషల్ మీడియాలో ‘కేసీఆర్ బయోపిక్ తీస్తే ప్రియదర్శినే చేయాలి’ అనే కామెంట్లు కూడా వినిపించాయి. అంతేకాదు, సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కేసీఆర్ బయోపిక్ తీయడానికి ప్లాన్ చేస్తున్నారని ప్రచారం మొదలైంది. మొత్తానికి, సినిమాలలో పోషించిన రియల్ పాత్రల ప్రభావం ఏ రేంజ్‌లో ఉంటుందో తెలియడానికి ది ప్యారడైజ్ లోని శంకరన్న పాత్ర మంచి ఉదాహరణ.


