Khairatabad Bypoll: గ్రేటర్ హైదరాబాద్ గడ్డపై మరో ఉప ఎన్నిక రసవత్తర పోరుకు తెరలేపింది. కంటోన్మెంట్‌లో బోణీ కొట్టి, జూబ్లీహిల్స్‌లో పాగా వేసి జోరుమీదున్న కాంగ్రెస్.. ఇప్పుడు ఖైరతాబాద్ బైపోల్‌లోనూ జెండా ఎగరేసి ‘గ్రేటర్ హ్యాట్రిక్’ పూర్తి చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి పక్కా మైక్రో మేనేజ్‌మెంట్‌తో కూడిన మాస్టర్ ప్లాన్‌ను రచిస్తున్నారు. అయితే గతంలో కలిసివచ్చిన సమీకరణాలు ఖైరతాబాద్‌లోనూ అదే స్థాయిలో పనిచేస్తాయా? లేక కాంగ్రెస్ వేస్తున్న ఎత్తుగడలు క్షేత్రస్థాయిలో బెడిసికొడతాయా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
జూబ్లీహిల్స్ ఫార్ములా ఇక్కడ చెల్లుతుందా
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించిన ఫార్ములానే ఖైరతాబాద్‌లోనూ ప్రయోగించేందుకు హస్తం అధిష్ఠానం సన్నద్ధమవుతోంది. ప్రతి కార్పొరేటర్ డివిజన్‌కు ఒక మంత్రి లేదా సీనియర్ ఎమ్మెల్యేను ఇన్‌ఛార్జ్‌గా దించి, బూత్ స్థాయి కమిటీలను రంగంలోకి దింపడం, అసంతృప్తులను దారికే తేవడం, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో నేరుగా మమేకమవ్వడం.. ఇదీ రేవంత్ మార్క్ మైక్రో మేనేజ్‌మెంట్.
ఈ ప్లాన్ కాగితాలపై బలమైన వ్యూహంగానే కనిపిస్తున్నా, క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. గతంలో హైదరాబాద్ మంత్రులు, స్థానిక కేడర్ మధ్య కనిపించిన సమన్వయం ఖైరతాబాద్‌లో ఎంతవరకు కొనసాగుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే గ్రేటర్ నగర ఓటర్ల తీరు అనూహ్యంగా ఉంటుంది. కేవలం నేతల ప్రచారం, హామీల ఆధారంగా కాకుండా స్థానిక మౌలిక వసతులు, పాలనాపరమైన అసంతృప్తులు బ్యాలెట్ బాక్సుల్లో ప్రతిబింబించే ప్రమాదం లేకపోలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
దానం నాగేందర్ చుట్టూ ఉన్న లెక్కలు
ఈ సమరంలో కాంగ్రెస్ వ్యూహంలో అత్యంత కీలకమైన అంశం అభ్యర్థి ఎంపిక. బీఆర్ఎస్ నుంచి వచ్చిన దానం నాగేందర్‌కు టికెట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తున్నప్పటికీ, అది పార్టీకి ప్లస్సా లేక మైనస్సా అన్న చర్చ జోరుగా నడుస్తోంది. దానంకు టికెట్ ఇవ్వకపోతే ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేలలో అభద్రతాభావం మొదలవుతుందన్న భయంతో కాంగ్రెస్ ఉంది.
కానీ దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న స్థానిక పాత కేడర్, ఇతర ఆశావాహులు దానం అభ్యర్థిత్వాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తారా? అన్నదే ఇక్కడ అసలు చిక్కు. ఎన్నికల వేళ ప్రత్యర్థులు ప్రధానంగా ‘పార్టీ ఫిరాయింపు’ అస్త్రాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న నేతకు మళ్లీ ఓటెందుకు వేయాలంటూ విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలను ఓటర్లు ఎలా తీసుకుంటారనేది ఫలితాన్ని నిర్దేశిస్తుంది.
బస్తీలు, మైనారిటీల నమ్మకం నిలిచేనా
ఖైరతాబాద్ భౌగోళిక ముఖచిత్రాన్ని పరిశీలిస్తే బస్తీ ఓట్ బ్యాంక్, మైనారిటీ సామాజిక వర్గాలు అత్యంత నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. ఈ వర్గాల్లో దానం నాగేందర్‌కు వ్యక్తిగతంగా పట్టున్న మాట వాస్తవమే. అయితే జీహెచ్‌ఎంసీ పరిధిలో హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుల నేపథ్యంలో బస్తీ వాసుల్లో, పేద ప్రజల్లో కొంత ఆందోళన నెలకొందన్న ప్రచారం కూడా జరుగుతోంది. విపక్షాలు ఈ అంశాలనే అస్త్రాలుగా మలుచుకుంటే కాంగ్రెస్ వేసిన ప్లాన్లు తలకిందులయ్యే ప్రమాదం ఉంది.
విపక్షాల ప్రతిఘటనను తట్టుకోగలదా
సిరిసిల్ల, సిద్దిపేట వేదికలుగా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ దూకుడు పెంచుతున్న బీఆర్ఎస్, నగరంలో గట్టి పట్టున్న బీజేపీలు ఈ బైపోల్‌ను లైట్‌గా తీసుకునే అవకాశమే లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి లేదా కాంగ్రెస్ ఆధిక్యాన్ని అడ్డుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతుంది.
ఈ పరిస్థితులన్నింటి నడుమ.. కేవలం మంత్రుల పర్యవేక్షణ, నాయకుల మొహరింపు మాత్రమే సరిపోదు. అంతర్గత కుమ్ములాటలను అణచివేసి, క్షేత్రస్థాయి అసంతృప్తులను తక్షణమే పరిష్కరించుకోగలిగితేనే హస్తవాసి కలిసి వస్తుందంటున్నారు. లేనిపక్షంలో మాస్టర్ ప్లాన్ తలకిందులై ఖైరతాబాద్ వేదికగా అధికార పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


