ఆంధ్రప్రదేశ్‌లో 'స్త్రీశక్తి' పథకం ద్వారా ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం, త్వరలోనే ఏసీ బస్సుల్లోనూ ఉచిత జర్నీ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. విజయవాడలో బుధవారం నిర్వహించిన 'పేదలకు పట్టాభిషేకం' కార్యక్రమంలో భాగంగా 26,400 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సంచలన ప్రకటన చేశారు. మహిళల సంక్షేమం, ప్రయాణ సౌకర్యాన్ని మరింత వేగవంతం చేయడంలో భాగంగా భవిష్యత్తులో నూతనంగా ఏసీ బస్సులను కొనుగోలు చేసి, వాటిలోనూ ఉచిత ప్రయాణాన్ని వర్తింపజేస్తామని స్పష్టం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులో ఉండగా.. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, నాన్-ఏసీ/ఏసీ స్లీపర్, సప్తగిరి వంటి ప్రీమియం సేవలను దీని నుంచి మినహాయించారు. అయితే పెరుగుతున్న డిమాండ్, సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆర్టీసీకి కొత్త ఏసీ బస్సులు సమకూరిన వెంటనే ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇదే సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60,000 మంది పేదలకు పక్కా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో భూసర్వేల పేరిట పాస్‌బుక్‌లపై నాయకుల ఫొటోలు ముద్రించి వివాదాలు సృష్టించారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారిక రాజముద్రతో నూతన పాస్‌బుక్‌లను అందజేస్తోందని, నిరుపేదలు పొందిన ఆస్తులను అమ్ముకోకుండా భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవాలని సూచించారు.


