Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. అక్టోబర్ 3న అమిత్ షా హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్, తూప్రాన్, కరీంనగర్ లో ఆయన పర్యటించనున్నారు. అక్టోబర్ 3న రాత్రి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న అమిత్ షా.. కాకతీయ హోటల్ లో బస చేయనున్నారు. అక్టోబర్ 4న మెదక్ జిల్లా తూప్రాన్ లోని ఊర్జా ఇండస్ట్రియల్ పార్క్ లో డెయిరీ మిల్క్ ప్లాంట్ నిర్మాణానికి అమిత్ షా శంకుస్థాపన చేయనున్నారు.
ఆ తర్వాత రైతులతో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అమిత్ షా పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు కరీంనగర్ జిల్లాలోనూ అమిత్ షా పర్యటించనున్నారు. ప్రతిమ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత బేగంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు.
తన పర్యటనలో భాగంగా రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై రాష్ట్ర నాయకులతో ఆయన చర్చించే ఛాన్సుంది.


