తెలంగాణలో గ్రామీణ ఉపాధి హామీ పథకం (వీబీ-జీ రామ్ జీ - VB-G RAM G) అమలే లక్ష్యంగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క బుధవారం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఉపాధి పనుల పురోగతి, కూలీలకు పనుల కల్పన, ఎదురవుతున్న సాంకేతిక సమస్యలపై హైదరాబాద్ నుంచి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో 12 వేల మందికి పైగా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో ఉపాధి పనుల ఎంపిక, ఆమోదంలో గ్రామసభల నిర్ణయాలకే అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఉపాధి అవకాశాలు దక్కేలా అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని ఆదేశించారు. పనుల కేటాయింపు, గుర్తింపులో పారదర్శకత, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. గ్రామ పంచాయతీల పాత్రను మరింత బలోపేతం చేస్తూ, క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు, కార్యదర్శులు ఎదుర్కొంటున్న సాంకేతిక, నిర్వహణ పరమైన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో ముందడుగు వేయాలని స్పష్టం చేశారు.
ఇటీవల అమల్లోకి వచ్చిన వీబీ-జీ రామ్ జీ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు ఉపాధి భద్రతతో పాటు గ్రామాల్లో శాశ్వత మౌలిక వసతుల కల్పన సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. కూలీల హాజరు నమోదు, ఈ-కేవైసీ వంటి అంశాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా మానిటరింగ్ నిరంతరం కొనసాగించాలని ఆదేశించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ఈ దిశగా క్షేత్రస్థాయి సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించి పథకం ప్రయోజనాలను ప్రతి పేద కుటుంబానికి చేరవేయాలని సూచించారు.
సమావేశంలో పాల్గొన్న జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీవోలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. వాటిని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఉపాధి కూలీలకు చెల్లింపులు సకాలంలో జరిగేలా చూడాలని, పనుల ప్రదేశాల్లో తాగునీరు, నీడ వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి వీబీ-జీ రామ్ జీ పథకాన్ని రాష్ట్రంలో విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.


