దేశంలో నిరుద్యోగం తగ్గినట్టు తెలుస్తోంది.ఈ విషయాన్ని కేంద్రం గణాంకాల సంస్థ తాజాగా ప్రకటించింది. దేశంలోని ఉపాధి, నిరుద్యోగ పరిస్థితులపై జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ), పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్)-2026 త్రైమాసిక రిపోర్టును సోమవారం విడుదల చేసింది. దేశంలోని ఉపాధి రంగం పలు సానుకూల అంశాలతో స్థిరమైన, మెరుగైన ప్రగతిని ప్రదర్శించింది.తాజా అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా 15 ఏండ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్ను వారిలో సగటున 56.6 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు.
అందులో 40.2 కోట్ల మంది పురుషులు, 16.4 కోట్ల మంది మహిళలు ఉన్నట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 15 ఏళ్లు పైబడిన వారిలో మొత్తం కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్ఎఫ్పీఆర్) ఈ క్వార్టర్‌లో 54.6 శాతంగా నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో మొత్తం ఎల్ఎఫ్పీఆర్- 50.2% మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతుండగా.. సిటీల్లో పురుషుల భాగస్వామ్యం 75.0% నుంచి 75.3 శాతానికి స్వల్పంగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 56.9శాతంగా నమోదు అయ్యింది.
పట్టణాల్లో కార్మిక జనాభా రేషియో (డబ్ల్యూపీఆర్) 46.8 శాతంగా స్థిరంగా కొనసాగుతోంది. దీనిలో పట్టణ పురుషుల డబ్ల్యూపీఆర్ 70.7% పెరగగా, మహిళల్లో 22.8 శాతంగా ఉన్నది.పట్టణాల్లో మొత్తం నిరుద్యోగ రేటు 6.7శాతం స్థిరంగా ఉన్నది. పట్టణాల్లోని మహిళల్లో నిరుద్యోగ రేటు గత త్రైమాసికంలో 9.1 శాతం ఉండగా.. ఈ త్రైమాసికంలో 8.7 శాతానికి తగ్గడం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 4.8 శాతంగా ఉంది.
ఉపాధి రంగాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండింటిలోనూ రెగ్యులర్ ఉద్యోగుల వాటా నెమ్మదిగా మెరుగైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వాటా 15.5% నుంచి 16.1%కు, పట్టణాల్లో 48.9% నుంచి 49.3%కి పెరిగింది. తయారీ, పారిశ్రామిక రంగాల్లోనూ ఉపాధి లభ్యత పెరిగినట్టు తాజా నివేదిక స్పష్టంచేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడే వారి వాటా 55.8% నుంచి 52.9%కు తగ్గగా.. గ్రామీణ సేవా రంగంలో ఉపాధి వాటా 21.7% నుంచి 22.7%కు పెరిగింది.












