బిగ్‌బాస్ విజేత,టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మీద కేసు నమోదు అయ్యింది. ఆయనతో పాటు మరో 16 మందిపై ఆంధప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ఎఫ్ఐఆర్ నమోదు అయినట్టు సమాచారం. ప్రస్తుతం రాహుల్ పలు సినిమాల్లో పాటలు పాడుతూ.. యూట్యూబ్ సాంగ్స్ చేస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గతంలోనూ ఓ పబ్బులో ఆయన మీద దాడి జరిగిన విషయం సంచలనం రేపింది. తాజాగా కేసు నమోదు కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే, రాహుల్ సిప్లిగంజ్ బావమరిది రాహుల్ రెడ్డి తనను చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని, మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడని విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు కేసు పెట్టగా తాజాగా వెలుగుచూసింది. తదుపరి విచారణ నిమిత్తం ఎండాడ మహిళా పోలీస్ స్టేషన్‌కు అక్కడి అధికారులు కేసును బదిలీ చేశారు.
https://x.com/RTVnewsnetwork/status/2086992933065216122?s=20
సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఆయన బావమరిది రాహుల్ రెడ్డి, హైకోర్టు అడ్వకేట్, జర్నలిస్టులపై బెదిరింపులు, సైబర్ నేరం, కుట్ర కోణాల్లో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. కాగా, అసలు ఈ కేసులో రాహుల్ సిప్లిగంజ్ పాత్ర ఎంత మేరకు ఉన్నదానే దానిపైనా పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.రాహుల్ సింగర్‌గా మంచి పేరున్నా.. పలు వివాదాస్పద విషయాల్లో ఆయన పేరు రావడం, పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగడంతో ఆయన ఫేమ్ పడిపోతుందని సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు అభిప్రాయాలు వెల్లడించారు.












