తిరుమలలో భక్తుల రద్దీ యథావిధిగా కొనసాగుతోంది.తెలంగాణలో వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, వర్షాలు తగ్గుముఖం పట్టడం, పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావొస్తుండటంతో స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తిరుమలకు క్యూ కడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం తిరుమల కొండ మీద భక్తుల రద్దీ సాధారణం కంటే అధికంగా ఉన్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. రూములు దొరకడం లేదని, సత్రాలు అన్ని నిండిపోయినట్టు సమాచారం.
రోజురోజుకూ భక్తుల తాకిడి పెరుగుతుండటంతో ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయినట్టు తెలిసింది. భక్తులు వెలుపల ఉన్న క్యూలైన్లలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నట్టు అధికారులు తెలిపారు.టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని తెలిసింది. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా టీటీడీ సిబ్బంది నిరంతరంగా పాలు, తాగునీరు, అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు.
మరోవైపు మెడికల్ ఎమర్జెన్సీ బృందాలను సైతం అందుబాటులో ఉంచినట్టు సమాచారం. ఇదిలాఉండగా, నిన్న ఒక్కరోజే 81,064 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్టు అధికారులు తెలిపారు. 33,136 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే శ్రీ వారి హుండీ ఆదాయం రూ.5.36 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో విపరీతంగా రద్దీ ఉండటంతో టీటీడీ సూచనలు పాటిస్తూ శ్రీవారి దర్శనానికి అందరూ సహకరించాలని అధికారులు కోరారు.












