కరీంనగర్‌లో ఘోర ఉదంతం వెలుగు చూసింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అనుచరుడు, 29వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్‌తో పాటు అతని అనుచరులు తీవ్రమైన హత్యాయత్నం కేసులో చిక్కుకున్నారు. కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ నగర్ ప్రాంతంలో నివాసముంటున్న శ్రీకాంత్ అనే యువకుడితో పాటు అతని సోదరుడిపై కార్పొరేటర్ , అతని వర్గీయులు దారణంగా కత్తులు, బీర్ సీసాలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో శ్రీకాంత్ కడుపులో బీర్ సీసాతో తీవ్రంగా పొడిచి, దాడికి పాల్పడిన రౌడీ మూక అక్కడి నుంచి పరారైంది.
రక్తమడుగులో పడివున్న బాధితుడు శ్రీకాంత్‌ను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కరీంనగర్ 3 టౌన్ పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణ దాడికి సంబంధించి ప్రధాన నిందితుడైన బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ (A-1)తో పాటు అతనికి సహకరించిన కుడిది నాగేందర్, పంతంగి మధు, నేరెళ్ల నాగరాజు, శ్రీరామోజు భానుచందర్, సంగం వేణు, పంతంగి శశిధర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీస్ అధికారులు హెచ్చరించారు. కరీంనగర్ నగరంలో ఒక ప్రజాప్రతినిధే నేరుగా గూండాగిరీకి పాల్పడి హత్యాయత్నానికి దిగడం తీవ్ర సంచలనం సృష్టించింది. గతంలో కూడా పలు వివాదాల్లో నిలిచిన కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్, ప్రజా సమస్యలను పరిష్కరించాల్సింది పోయి రౌడీ మూకలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఘటన జరిగిన వెంటనే విచారణ ముమ్మరం చేసిన పోలీసులు, నిందితులపై హత్యాయత్నం కింద కఠిన సెక్షన్లతో కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. అధికార లేదా రాజకీయ ప్రాబల్యాన్ని అడ్డుపెట్టుకుని నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని, నగరంలో ఇటువంటి అరాచక ఘటనలను ఏమాత్రం సహించేది లేదని కమిషనరేట్ వర్గాలు స్పష్టం చేశాయి.












